Abn logo
Feb 21 2020 @ 00:36AM

పరీక్షించి తెలుసుకోండి!

  • ఈ నెల 25న శ్రీ రామకృష్ణ పరమహంస జన్మతిథి


‘‘పెద్ద నాణేలకు చిల్లర ఇచ్చే వ్యక్తి అతను తీసుకున్న నాణేలను ఎలా పరీక్షిస్తాడో, నన్ను మీరు అలా పరీక్షించండి. నన్ను క్షుణ్ణంగా పరిశీలించే వరకూ నన్ను, నా ఉపదేశాలనూ మీరు ఆమోదించకండి’’ అని తన సన్నిహిత శిష్యులకు శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పేవారు. ఆయనకు ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద స్వభావ రీత్యా ఆధునికుడు. హేతుబద్ధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. అనేక సందర్భాల్లో తన గురువును వివేకానంద పరీక్షించారు. ఆ క్రమంలోనే శ్రీ రామకృష్ణుల గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగానని చెప్పేవారు. ఎప్పుడూ శ్రీ రామకృష్ణుల విశిష్టతను వివేకానందుడు చాటి చెబుతూ ఉండేవారు. 


వివేకానందుని అసలు పేరు నరేంద్రనాథ్‌. ఆయన కలకత్తాలో విద్యార్థిగా ఉన్నప్పుడు, అక్కడ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న విలియం హస్టీ ద్వారా శ్రీ రామకృష్ణుల పేరును తొలిసారిగా విన్నారు. దక్షిణేశ్వర్‌లో పూజారిగా ఉన్న శ్రీ రామకృష్ణుల విశిష్టత గురించి తెలుసుకున్న నరేంద్రనాథ్‌ ఆయనను కలుసుకున్నారు. తన సందేహాలను తీర్చుకున్నారు. శ్రీ రామకృష్ణులను తన గురువుగా స్వీకరించి, ఆధ్యాత్మికపరమైన ఉన్నతికి బాటలు వేసుకున్నారు. నరేంద్రనాథ్‌... ‘వివేకానందుడు అయ్యారు’. ఆ గురు శిష్యుల మధ్య ఒకసారి ప్రశ్నోత్తరాల రూపంలో సాగిన సంభాషణ ఇది:


వివేకానంద: నాకు ఖాళీ సమయం దొరకడం లేదు. జీవితంలో తీరిక లేకుండా ఉంది

రామకృష్ణులు: పనులు తీరిక లేకుండా చేస్తాయి. కానీ పనివల్ల వచ్చే ఫలితం మిమ్మల్ని స్వేచ్ఛాపరునిగా మారుస్తుంది.

వివేకానందుడు: జీవితం ఇప్పుడు చాలా క్లిష్టంగా అనిపిస్తోంది, ఎందుకని?

రామకృష్ణులు: జీవితాన్ని విశ్లేషించడం మానండి. దానివల్ల జీవితం మరింత క్లిష్టంగా మారిపోతుంది. జీవితాన్ని ఆస్వాదించండి.

వివేకానందుడు: మనం ఎప్పుడూ సంతోషంగా లేకుండా ఎందుకు ఉంటున్నాం?

రామకృష్ణులు: విచారంగా ఉండడం మీకు ఒక అలవాటుగా మారింది. అందుకే మీరు సంతోషంగా లేరు.

వివేకానందుడు: ఎప్పుడూ కష్టాలన్నీ మంచి వాళ్ళకే ఎందుకు వస్తున్నాయ్‌?

రామకృష్ణులు: మంటలో పెట్టకపోతే బంగారం శుద్ధి కాదు కదా? మంచి వాళ్ళకు పరీక్షలు ఎదురవుతాయి, కానీ వాళ్ళు బాధపడరు. ఆ అనుభవంతో వాళ్ళ జీవితం చేదుగా మారిపోదు, మరింత మెరుగు పడుతుంది.

వివేకానందుడు: అంటే అలాంటి అనుభవం ఉపయోగపడుతుందంటారా?

రామకృష్ణులు: అవును. అన్ని విధాలుగానూ అనుభవం అనేది ఒక కఠినమైన గురువు. అది మొదట పరీక్ష పెడుతుంది. తరువాత పాఠాలు నేర్పుతుంది. 

వివేకానందుడు: సమస్యలు చాలా ఎక్కువగా ఉండడంతో, ఎటు వెళ్తున్నామో ఏమాత్రం అర్థం కావడం లేదు...

రామకృష్ణులు: మీరు బయటికి మాత్రమే చూస్తున్నారనుకోండి, ఎటు వెళ్తున్నారో మీకు తెలీదు. కాబట్టి మీ లోపలికి చూసుకోండి. కళ్ళు సరైన చూపును అందిస్తాయి. హృదయం మార్గాన్ని చూపిస్తుంది. 

వివేకానందుడు: సరైన దిశలో ప్రయాణించడం కన్నా వైఫల్యం ఎక్కువ బాధ కలిగిస్తుంది కదా?

రామకృష్ణులు: విజయం అనేది ఇతరులు నిర్ణయించే ఒక కొలమానం. మీరు నిర్ణయించుకొనే కొలమానం ఒకటుంది. అది- సంతృప్తి.

వివేకానందుడు: కష్టాలు ఎదురైన సందర్భాల్లో మీరు ప్రేరణ ఎలా పొందుతున్నారు?

రామకృష్ణులు: ఇంకా ఎంత దూరం ప్రయాణించాలని కాకుండా ‘గమ్యం వైపు ఎంత దూరం వచ్చాం’ అనేది ఎప్పుడూ లెక్కలోకి తీసుకోండి. వరాలుగా అంది వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకోండి. లేని వాటి గురించి ఆలోచన వద్దు.

వివేకానందుడు: ప్రజల్లో మీకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి?

రామకృష్ణులు: వాళ్ళకు ఏదైనా కష్టం కలిగితే ‘‘ఇది నాకే ఎందుకు వచ్చింది?’’ అని అడుగుతారు. కానీ సుఖ సంపదలు వచ్చినప్పుడు ఆ ప్రశ్న ఎన్నడూ వేసుకోరు. 

వివేకానందుడు: జీవితం నుంచి అత్యుత్తమమైన దాన్ని ఎలా అందుకోవాలి?

రామకృష్ణులు: మీ గతం ఎలాంటిదైనా కావచ్చు, దాన్ని ఎటువంటి విచారం లేకుండా ఎదుర్కోండి. మీ వర్తమానాన్ని విశ్వాసంతో కొనసాగించండి. భవిష్యత్తు కోసం నిర్భయంగా సంసిద్ధులు అవండి.

వివేకానందుడు: ఇది ఆఖరు ప్రశ్న. నా ప్రార్థనలకు సమాధానం రావడం లేదని కొన్నిసార్లు నాకు అనిపిస్తోంది.

రామకృష్ణులు: సమాధానాలు లేని ప్రార్థనలు ఉండవు. విశ్వాసాన్ని వదలకండి. భయాన్ని విడిచిపెట్టండి. జీవితం ఒక మర్మం. అదేమిటో తెలుసుకోవాలి. అంతే తప్ప జీవితం పరిష్కరించాల్సిన ఒక సమస్య కాదు. నన్ను నమ్మండి. ఎలా జీవించాలో తెలుసుకుంటే జీవితం ఒక అద్భుతం.

ఇటువంటి సందేహాలెన్నిటినో శ్రీ రామకృష్ణులు నివృత్తి చేసి వివేకానందుడికి మార్గదర్శి అయ్యారు. ఆధ్యాత్మిక రంగంలో సద్గురువుగా అత్యున్నత స్థానంలో నిలిచారు.


Advertisement
Advertisement
Advertisement