Sep 19 2021 @ 12:51PM

పరీక్ష, మార్కులు ప్రాణం కంటే గొప్పవి కావు: హీరో సూర్య

పరీక్ష, మార్కులు ప్రాణం కంటే గొప్పవి కావు అని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అన్నారు. ఇటీవలికాలంలో పరీక్షలకు భయపడి కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ బలవన్మరణాలు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా నీట్‌ పరీక్షకు భయపడి రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా, విద్యార్థులకు మరింత ధైర్యం చెప్పేలా హీరో సూర్య ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘అచ్చమిల్లై అచ్చమిల్లై... అంటూ సూర్య విద్యార్థులకు ధైర్యవచనాలు చెప్పారు. ‘విద్యార్థినీవిద్యార్థులంతా ఎలాంటి భయాందోళనలు లేకుండా జీవితంపై పూర్తి నమ్మకంతో జీవించాలని ఒక అన్నగా కోరుకుంటున్నాను. 


గత వారం, నెల రోజులకు ముందుమీ మనస్సుల్లో ఉన్న భారం ఇప్పుడు ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఆ భారం తగ్గివుంటుంది. లేదా పూర్తిగా  పోయివుంటుంది. ఒక పరీక్ష మీ ప్రాణాల కంటే పెద్దదికాదు. మీ మనసుకు కష్టంగా ఉంటే, మీకు నచ్చిన, మీకు ఇష్టమైన అమ్మ, నాన్న, స్నేహితులు, పెద్దవారు, ఉపాధ్యాయులతో మనస్సు విప్పి మాట్లాడండి. భయం, వేదన, విరక్తి, దిగులు ఇలాంటి విషయాలన్నీ కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల్లో తగ్గిపోయే సమస్యలు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులను జ్ఞాపకం చేసుకోండి. మీరు తీసుకునే బలవన్మరణ నిర్ణయం వారిని జీవితాంతం క్షోభకు గురిచేస్తూనే ఉంటుంది. బాధపడేలా చేస్తుంది. పరీక్ష, మార్కులు అనే రెండు అంశాలే జీవితం కాదు. జీవితంలో సాధించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. మిమ్మలను ప్రేమించేందుకు, మీతో స్నేహం చేసేందుకు అనేకమంది ఉన్నారు. నమ్మకం, ధైర్యంతో ఉంటే ప్రతి ఒక్కదాన్ని జయించవచ్చు.’ అంటూ సూర్య  ఆ సందేశంలో పేర్కొన్నారు.