టెట్‌ అభ్యర్థులకు.. పరీక్షే!

ABN , First Publish Date - 2022-07-30T05:36:59+05:30 IST

ఇటువంటి సమస్య వీరు ఇద్దరిదే కాదు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది అభ్యర్థులకు ఇదే పరిస్ధితి ఉంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. సుదూ

టెట్‌ అభ్యర్థులకు.. పరీక్షే!

సుదూర ప్రాంతాల్లో కేంద్రాల కేటాయింపు

అంతటా గందరగోళం

వ్యయప్రయాసలు తప్పవని ఆవేదన

(కలెక్టరేట్‌)

- గంట్యాడ మండలం పొల్లంకి చెందిన ఈయన పేరు కొంచ రవి. ఈ ఏడాది ఎస్‌జీటీతో పాటు ఇంగ్లీష్‌, సోషల్‌ అసిస్టెంట్‌ సబ్జెక్టుల్లో టెట్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో విజయనగరం జిల్లాలోని పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. అయితే ఆన్‌లైన్‌లో చూడగా తెలంగాణలోని హైదరాబాద్‌లో మాత్రమే కేంద్రాలు ఖాళీగా ఉన్నట్టు శ్లాబు చూపిస్తోంది. తప్పనిసరి కావడంతో కేంద్రాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. వచ్చే నెల 9, 12, 13 తేదీల్లో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. ఇందుకుగాను రూ.10 వేలు ఖర్చవుతుందని రవి చెబుతున్నాడు. 

- గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ఈమె పేరు చప్ప దేవి. ఈ ఏడాది టెట్‌ రాసేందుకు నిర్ణయించుకొని దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోనే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి చేసుకోవాలని చెప్పారు. అయితే మన రాష్ట్రంలో కేంద్రాలు ఖాళీ లేవు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ కేంద్రాల్లో ఖాళీలు చూపిస్తుండడంతో ఎక్కడ ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.  

ఇటువంటి సమస్య వీరు ఇద్దరిదే కాదు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది అభ్యర్థులకు ఇదే పరిస్ధితి ఉంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు అయోమయం చెందుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి 21 వరకు టెట్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో 15,333 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి విద్యాశాఖ సుదూర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించింది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే పరీక్షలకు కంప్యూటర్‌ ల్యాబ్స్‌ ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలలు, డిజిటల్‌ ల్యాబ్స్‌ మాత్రమే గుర్తించారు. మన జిల్లాలో మూడు ఇంజనీరింగ్‌ కాలేజీలకు మాత్రమే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు సదుపాయాలు ఉన్నాయి. జిల్లా నుంచి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సరిపడా కేంద్రాలు లేవు.  ఈ నెల 23 నుంచి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల ఎంపికకు ఆప్షన్‌ ఇచ్చారు.  ముందుగా కేంద్రాలను ఎంపిక చేసుకున్నవారికి జిల్లాలో కేటాయించారు. ఆలస్యమైన అభ్యర్థులకు జిల్లాలో కేంద్రాలు లేకుండా పోయాయి. విశాఖ, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల్లో కూడా పరీక్షా కేంద్రాలు నిండిపోయాయి. దీంతో జిల్లాకు చెందిన అభ్యర్థులకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలను కేటాయించారు. ఇంకా ఆలస్యంగా నమోదు చేసుకున్నవారికి పొరుగురాష్ట్రాల్లో కేంద్రాలను కేటాయిస్తున్నారు. దీంతో అంత దూరం వెళ్లి పరీక్ష రాయాలా? వద్దా? అని కొంతమంది అభ్యర్థులు సతమతమవుతున్నారు. 



Updated Date - 2022-07-30T05:36:59+05:30 IST