Jammu and Kashmir: స్థానికేతరులపై దాడులు పెరుగుతాయి : ఉగ్రవాదుల హెచ్చరిక

ABN , First Publish Date - 2022-08-18T20:39:12+05:30 IST

జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లో స్థానికేతరులకు

Jammu and Kashmir: స్థానికేతరులపై దాడులు పెరుగుతాయి : ఉగ్రవాదుల హెచ్చరిక

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లో స్థానికేతరులకు ఓటు హక్కు కల్పించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. స్థానికేతరులపై మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న కశ్మీర్ ఫైట్ (Kashmir Fight) అనే ఉగ్రవాద సంస్థ ఈ హెచ్చరిక జారీ చేసింది. ఎలాంటివారిపై దాడులు జరుగుతాయో ఓ జాబితాను కూడా విడుదల చేసింది. 


ఈ సంస్థ భారత దేశ ప్రభుత్వాన్ని వలసవాద ఫాసిస్ట్ సెటిలర్ ప్రభుత్వంగా పేర్కొంది. ఈ సంస్థలో పని చేసే ఉగ్రవాదులను రెసిస్టెన్స్ ఫైటర్స్ అని చెప్పుకుంది. నాన్ లోకల్స్ (Non Locals)కు ఓటు హక్కు కల్పించడాన్ని చెత్త కార్యక్రమమని పేర్కొంది. ఇది జనాభాపరమైన ఉగ్రవాదమని మండిపడింది. 


కశ్మీర్ ఫైట్ విడుదల చేసిన ప్రకటనలో, ‘‘స్థానికేతర కశ్మీరీలందరికీ ఓటు హక్కు కల్పించడానికి సంబంధించి ఫాసిస్ట్ సెటిలర్ భారత ప్రభుత్వం తీసుకున్న వలసవాద నిర్ణయం తర్వాత, ఢిల్లీలో రూపొందించిన ఈ చెత్త కార్యక్రమం గురించి స్పష్టత వచ్చింది. ఇది జనాభాపరమైన ఉగ్రవాదం. ఇక తమ టార్గెట్లకు ప్రాధాన్యం ఇచ్చి దాడులను వేగవంతం చేయవలసిన అవసరం రెసిస్టెన్స్ ఫైటర్స్‌కు వచ్చింది. టార్గెట్ల జాబితా : ప్రతి స్థానికేతరుడు, స్థానికేతరురాలు... ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కూలీలు, బిచ్చగాళ్ళు, పర్యాటకులు, పారితోషికం కోసం పని చేసే పారామిలిటరీ/జమ్మూ-కశ్మీరు పోలీసు దళాల సిబ్బంది, స్థానిక ద్రోహులు, సహకరించేవారు, చిన్న లేదా పెద్ద తొత్తులు. వీరి ఇళ్లు, సెటిల్మెంట్లను తగులబెట్టాలి. సెటిలర్ల కాలనీలపై దాడులు చేయాలి. జమ్మూతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా దాడులను తీవ్రతరం చేయాలి. మరిన్ని వివరాలతో కూడిన ప్రణాళికను త్వరలోనే కశ్మీర్‌ఫైట్ (kashmirfight.com) సైట్‌లో అప్‌లోడ్ చేస్తాం’’ అని పేర్కొంది. 


ఇదిలావుండగా, జమ్మూ-కశ్మీరు ప్రధాన ఎన్నికల అధికారి (CEO) హిర్దేష్ కుమార్ అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. జమ్మూ-కశ్మీరులో నివసిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఓటు హక్కును పొందడం కోసం ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని కోరారు. స్థానికేతరులంతా జమ్మూ-కశ్మీరు ఎన్నికల్లో ఓటు వేయవచ్చునని తెలిపారు. ఓటరుగా నమోదు చేయించుకోవడానికి స్థానికత ధ్రువపత్రం అక్కర్లేదని చెప్పారు. పీస్ స్టేషన్లలో పని చేస్తున్న, రక్షణ దళాలకు చెందిన సిబ్బంది కూడా జమ్మూ-కశ్మీరులో ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చునని తెలిపారు. 


Updated Date - 2022-08-18T20:39:12+05:30 IST