నటికి జైలు శిక్ష వేసిన ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2021-11-09T21:00:43+05:30 IST

యెమన్ దేశానికి చెందిన మోడల్, నటి ఎంటెసార్

నటికి జైలు శిక్ష వేసిన ఉగ్రవాదులు

న్యూఢిల్లీ : యెమన్ దేశానికి చెందిన మోడల్, నటి ఎంటెసార్ అల్-హమ్మది (20) షూటింగ్‌కు వెళ్ళేటపుడు ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. బహిరంగ నైతిక నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ శిక్ష విధించింది. ఆమెను రాజధాని నగరం సనాలో ఫిబ్రవరిలో హౌతీ రెబెల్స్ అరెస్టు చేశారు. 


ఇరాన్ మద్దతుగల హౌతీ రెబెల్స్ ఫిబ్రవరిలో సనా నగరంలోని ఓ చెక్ పాయింట్ వద్ద ఎంటెసార్ అల్-హమ్మదిని అరెస్టు చేశారు. ఆమె తన తలకు హెడ్‌స్కార్ఫ్ ధరించలేదని, యెమన్ సామాజిక నిబంధనలను ధిక్కరించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన సనా నగరంలోని ఓ కోర్టు ఆమెకు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఆదివారం తీర్పు చెప్పింది. 


ఇదిలావుండగా, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హమ్మది తరపు న్యాయవాది ఖలేద్ మహమ్మద్ తీవ్ర ఆరోపణలు చేశారు. హమ్మది నిర్బంధంలో ఉండగా చిత్రహింసలకు గురయ్యారని తెలిపారు. ఆమె కళ్ళకు గంతలు కట్టారని, శారీరకంగా హింసించారని, జాత్యహంకారపూరితంగా అవమానించారని పేర్కొన్నారు. కొన్ని నేరాలను అంగీకరించేవిధంగా నిర్బంధించారని చెప్పారు. 


Updated Date - 2021-11-09T21:00:43+05:30 IST