కశ్మీరులో చొరబడేందుకు సిద్ధంగా ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2021-08-05T23:18:21+05:30 IST

నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాద స్థావరాల్లో సుమారు

కశ్మీరులో చొరబడేందుకు సిద్ధంగా ఉగ్రవాదులు

శ్రీనగర్ : నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాద స్థావరాల్లో సుమారు 140 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వీరంతా జమ్మూ-కశ్మీరులో చొరబడేందుకు అనువైన సమయం కోసం వేచి చూస్తున్నారని భద్రతా దళాలకు చెందిన అధికారి ఒకరు గురువారం చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని భారత్, పాక్ ఫిబ్రవరిలో అంగీకరించినప్పటికీ ఈ పరిణామాలు జరుగుతుండటం గమనార్హం. 


ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి ఉంటే, ఆ దేశంపై నమ్మకం పెరిగి ఉండేదని ఆ అధికారి తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడం పాకిస్థాన్‌కు చాలా ముఖ్యమని చెప్పారు. చొరబాట్లను నిరోధించే వ్యవస్థ మన దేశంలో పటిష్టంగా ఉండటం వల్ల ఎల్ఓసీ వద్ద వేచి ఉన్న సుమారు 140 మంది ఉగ్రవాదులు కశ్మీరులో చొరబడలేకపోతున్నట్లు తెలిపారు. 


కశ్మీరులో చొరబడేందుకు ఈ ఉగ్రవాదులు ఇటీవల చేసిన ప్రయత్నాలను భారతీయ దళాలు విజయవంతంగా తిప్పికొట్టడంతో, వారంతా తిరిగి పాకిస్థాన్‌వైపు వెళ్ళిపోయారన్నారు. 


జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత విదేశీ ఉగ్రవాదులు అదృశ్యమయ్యారని తెలిపారు. వీరు జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల, పర్వత ప్రాంతాల్లో దాక్కున్నారని తెలిపారు. 


Updated Date - 2021-08-05T23:18:21+05:30 IST