టెర్రరిస్టులమా? సంఘ విద్రోహులమా?

ABN , First Publish Date - 2022-08-17T08:13:23+05:30 IST

భద్రాచలం ఏజెన్సీలో వరద బాధితులను పరామర్శించడంతో పాటు దుమ్ముగూడెం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లిన తమను

టెర్రరిస్టులమా? సంఘ విద్రోహులమా?

దుమ్ముగూడెం సందర్శనను అడ్డుకోవడం అప్రజాస్వామికం 

రాష్ట్ర ప్రభుత్వంపై సీఎల్పీ బృందం ఆగ్రహం

రాత్రి మణుగూరు క్రాస్‌ రోడ్డులో  నేతల బైఠాయింపు.. అరెస్టు  

పర్యటనకు జగ్గారెడ్డి గైర్హాజరు 


భద్రాచలం, మర్రిగూడ, ఆగస్టు 16: భద్రాచలం ఏజెన్సీలో వరద బాధితులను పరామర్శించడంతో పాటు దుమ్ముగూడెం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీఎల్పీ బృందం ఽధ్వజమెత్తింది. తాము టెర్రరిస్టులమో.. సంఘ విద్రోహ శక్తులమో కాదని, కాంగ్రెస్‌ నిషేధిత పార్టీ కాదని పేర్కొంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకుడు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తది తరులు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. దుమ్ముగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు సీఎల్పీ బృందం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డిలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. భద్రతా కారణాల రీత్యా అనుమతించడం లేదని పోలీసులు చెప్పడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం సామాన్యులకు ఏం రక్షణ ఇస్తుందని ప్రశ్నించారు. అనంతరం సీఎల్పీ బృందం భద్రాచలంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వానికి టెర్రరిస్టుల్లా, తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. భద్రాచలానికి శాశ్వతంగా ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు సీఎం ప్రకటించిన రూ.1000 కోట్లతో తక్షణమే పనులను చేపట్టాలని డిమాండ్‌ చేశారు.


భద్రాద్రి అభివృద్ధి విషయమై సీఎల్పీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందన్నారు. పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను అప్పగించడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని విమర్శించారు. ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలోని భద్రాచలంలో కలపాలని కోరుతూ రాష్ట్రపతిని కలుస్తామని వివరించారు. కాగా, సీఎల్పీ బృందాన్ని మంగళవారం ఉదయం భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు రాత్రివేళ అశ్వాపురం కూడా వెళ్లకుండా మణుగూరు క్రాస్‌రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దాంతో నాయకులు 2 గంటల పాటు రోడ్డు పై బైఠాయించి, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్ధితుల మధ్య పోలీసులు నాయకులను అరెస్టు చేశారు. కాగా, సీఎల్పీ బృంద పర్యటనకు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. జగ్గారెడ్డి ఇటీవల తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయడంతో అలసటకు గురై రాలేకపోయారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. 


బీజేపీ, టీఆర్‌ఎస్‌ వల్లే ఉప ఎన్నిక: మల్లు రవి

బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు పథకం ప్రకారమే మునుగోడు లో ఉప ఎన్నిక వచ్చేలా చేశాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో  కార్యకర్తల సమావేశాల్లో వారు మాట్లాడారు.

Updated Date - 2022-08-17T08:13:23+05:30 IST