ఉగ్రవాదుల రహస్యస్థావరంలో 1918 ఏకే -47 తూటాలు లభ్యం

ABN , First Publish Date - 2020-08-13T17:32:01+05:30 IST

స్వాతంత్ర దినోత్సవం మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించడం....

ఉగ్రవాదుల రహస్యస్థావరంలో 1918 ఏకే -47 తూటాలు లభ్యం

పుల్వామాలో రహస్యస్థావరం గుట్టురట్టు

పుల్వామా (జమ్మూకశ్మీర్): స్వాతంత్ర దినోత్సవం మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించడం సంచలనం రేపింది. పుల్వామా జిల్లా అవంతిపొరా ప్రాంతంలోని బార్సూ గ్రామంలో కేంద్ర భద్రతా బలగాలు గురువారం గాలించగా ఉగ్రవాదుల రహస్య స్థావరం వెలుగుచూసింది. బార్సు గ్రామంలో జవాన్లు జరిపిన గాలింపులో లష్కరే తోయిబాకు చెందిన రహస్య స్థావరాన్ని కనుగొన్నారు. అటవీప్రాంతంలో ఉన్న ఈ రహస్య స్థావరంలో 1918 ఏకే -47 తూటాలు, రెండు హ్యాండ్ గ్రెనెడ్లు, నాలుగు పెద్ద గ్రెనెడ్లు, అమ్మోనియం నైట్రేట్ బ్యాగు, 5 జిలిటిన్ స్టిక్కులు, క్రూడ్ పైపు బాంబు, 5,400 రూపాయల నగదు, గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్, ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు లభించాయి. స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు వ్యూహం పన్నవచ్చనే అనుమానంతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఆగస్టు 7వతేదీన పూంచ్ జిల్లా షషితార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల రహస్యస్థావరాన్ని కనుగొన్నారు. ఇంటెలిజెన్స్ అందించిన సమాచారంతో భద్రతాబలగాలు గాలించగా ఉగ్రవాదుల రహస్యస్థావరాలు వెలుగుచూశాయి. 

Updated Date - 2020-08-13T17:32:01+05:30 IST