ట్రాక్‌ తప్పారు..!

ABN , First Publish Date - 2022-05-10T06:39:48+05:30 IST

ట్రాక్‌ తప్పారు..!

ట్రాక్‌ తప్పారు..!

రైలు పట్టాలే కేంద్రంగా పోకిరీల హల్‌చల్‌

నగరంలో పెచ్చుమీరుతున్న నేరాలు

15 ప్రాంతాలను గుర్తించిన పోలీసులు

24/7 ఫుట్‌ పెట్రోలింగ్‌కు నిర్ణయం

పోలీస్‌, ఆర్పీఎఫ్‌ జాయింట్‌ ఆపరేషన్‌

ప్రత్యేక సెలూన్‌లో శివార్ల వరకు పరిశీలన


అల్లరిమూకలు పట్టాలు దాటుతున్నారు. దారుణాలకు తెగబడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్నారు. నగరంలోని కీలక ప్రాంతాలే టార్గెట్‌గా పోకిరీలు నేరాలకు తెగబడుతుండటం, ఇటీవల కాలంలో ఈ కేసుల సంఖ్య పెరగడంతో పోలీసులు ఫీల్డ్‌లోకి దిగారు. రైల్వే పట్టాలకు సమీపంలో ఉన్న ప్రాంతాలను జల్లెడ పట్టిన పోలీస్‌, ఆర్పీఎఫ్‌ బలగాలు ప్రత్యేక భద్రతా వలయాన్ని గీశాయి.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : రైలు పట్టాలు పోకిరీలకు మీటింగ్‌ పాయింట్లుగా మారిపోతున్నాయి. స్టేషన్‌కు శివారున ఉన్న క్యాబిన్లు అసాంఘిక శక్తులకు కేంద్రాలుగా తయారవుతున్నాయి. ట్రాక్‌లకు రెండువైపులా నిర్మించిన ప్రహరీలకు రంధ్రాలు చేసి మత్తుబాబులు, బ్లేడ్‌బాబులు లోపలికి ప్రవేశిస్తున్నారు. యార్డులో ఉన్న గూడ్స్‌ ర్యాకుల్లో రకరకాల వ్యవహారాలు నడుపుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇక్కడ పంచాయితీలు జరుగుతున్నాయి. చీకటి పడ్డాక మందు విందులకు ఈ పట్టాలే వేదికలవుతున్నాయి. 

ప్రధాన ఏరియాల్లో ఇంతే.. 

నగరంలోని పాతరాజరాజేశ్వరిపేట, న్యూరాజరాజేశ్వరిపేట, మిల్క్‌ప్రాజెక్టు, వించిపేట, కేఎల్‌ రావు నగర్‌, నైజాంగేటు, అజిత్‌సింగ్‌నగర్‌, తారాపేట ప్రాంతాలు రైలు పట్టాలను ఆనుకుని ఉంటాయి. ఇక్కడి నుంచి నేరుగా పట్టాల మీదకు చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న అల్లరిమూకలు, మందుబాబులు సమీపంగా ఉన్న ప్రదేశాలను తమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. సూర్యాస్తమయం కాగానే గ్రూపులుగా ఇక్కడికి చేరిపోతున్నారు. ఈ పట్టాల వెంబడి నిఘా అంతంతమాత్రంగానే ఉండటంతో అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. కొన్నాళ్ల క్రితం స్నేహం ముసుగులో ఓ యువకుడిని పాత రాజరాజేశ్వరిపేట వైపున ఉన్న పట్టాల వద్దకు తెచ్చి గొంతు కోసి హతమార్చిన ఘటన ఈ కోవలోనిదే. 

గూడ్స్‌ ర్యాకుల్లో అసాంఘిక కార్యకలాపాలు

మిల్క్‌ప్రాజెక్టు సమీపంలో గూడ్స్‌ షెడ్‌ వద్ద నిర్మించిన కూలీల విశ్రాంతి షెడ్‌ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రమైంది. సాయంత్రం నుంచి కూలీలు వెళ్లిపోవడంతో పోకిరీలు చేరుతున్నారు. దీనికి చెంతనే గూడ్స్‌ ర్యాకులు ఉంటాయి. ఖాళీగా ఉన్న ర్యాకులను రాసలీలల గదులుగా మార్చుకుంటున్నారు. వ్యభిచారులను ఇక్కడికి తెచ్చి శృంగార లీలలు నడుపుతుండగా, స్థానికులే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటనలు ఉన్నాయి. దీన్నిబట్టి రైలు పట్టాల వెంబడి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. 

గంజాయి, బ్లేడ్‌బ్యాచ్‌లకు అడ్డా

సాయంత్రం 6 గంటలు కాగానే గంజాయి, బ్లేడ్‌, మందుబ్యాచ్‌లు పట్టాల పైన వాలిపోతున్నాయి. ఇలా వస్తున్న వారంతా ఆయా ప్రాంతాలకు చెందినవారేనని సమాచారం. ఈ పోకిరీలు పట్టాల మధ్యన సిట్టింగ్‌లు నిర్వహించడానికి అనేక కారణాలున్నాయి. పట్టాలకు అటువైపున గానీ, ఇటువైపున గానీ తుప్పలు ఉంటాయి. వాటి కింద కూర్చుంటే ఎవరికీ కనిపించే అవకాశం ఉండదు. అలాగే, రాత్రిపూట పట్టాల వెంబడి గ్యాంగ్‌మెన్లు తిరగరు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది పెట్రోలింగ్‌ నిర్వహించినా కొంతదూరమే పరిమితమవుతుంది. వాటిన్నింటినీ పోకిరీలు అవకాశాలుగా మార్చుకుంటున్నారు. తారాపేట నుంచి నైజాంగేటు వరకు ఒకవైపున నివాసాలు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రైవేట్‌ వ్యక్తులు పట్టాల పైకి రాకుండా రైల్వేశాఖ ప్రహరీని నిర్మించింది. వాటికి రాత్రిరాత్రికి రంధ్రాలు చేసి రాకపోకలకు అనువుగా మార్చుకుంటున్నారు. వాటిని పూడ్చే పనికి రైల్వే అధికారులు పూనుకోవట్లేదు. ఫలితంగా ఈ రంధ్రాలు అసాంఘిక శక్తులకు రాచమార్గాలుగా తయారయ్యాయి. నైజాంగేటు నుంచి బొగ్గు క్వార్టర్ల వరకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని అధికారులు నిర్మించారు. దీనిపై రైల్వే సిబ్బంది మాత్రమే రాకపోకలు సాగిస్తారు. రాత్రి సమయాల్లో ఖాళీగా ఉండటంతో కొంతమంది దీనిపైనే మందు విందులు చేసుకుంటున్నారు. శివారు ప్రాంతాలు విశాలంగా ఉండటం, పట్టాలు ఎక్కువ కావడంతో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది. 


పోలీస్‌ జాయింట్‌ ఆపరేషన్‌

నగరంలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో సిటీ పోలీసులు, ఆర్పీఎఫ్‌ (రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) అధికారులు సోమవారం జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా, ఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ వల్లేశ్వర్‌, డీసీపీ బాబూరావు, ఏసీపీలు డాక్టర్‌ హనుమంతరావు, రమణమూర్తి, రైల్వే అధికారులతో కలిసి ప్రత్యేక సెలూన్‌లో పర్యటించారు. రైల్వేస్టేషన్‌ నుంచి శివారు ప్రాంతాల వరకు వెళ్లారు. పట్టాలకు రెండువైపులా ఉన్న ప్రదేశాలను, అక్కడి లోపాలను గుర్తించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ జాయింట్‌ ఆపరేషన్‌ జరిగింది. విశాఖ వైపు, హైదరాబాద్‌ వైపు ట్రాక్‌లను పరిశీలించారు. అక్కడ గుర్తించిన అంశాలను రైల్వేస్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. స్టేషన్‌ నుంచి శివారు ప్రాంతాల వరకు మొత్తం 15 ప్రదేశాలు అసాంఘిక శక్తులకు అనువుగా ఉన్నాయని గుర్తించారు. ఇందులో తొలి విడతగా ఏడు ప్రదేశాల్లో 24/7 ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సిటీ పోలీస్‌ విభాగం నుంచి 50 మందిని జీఆర్పీ విభాగానికి కేటాయిస్తామని పోలీసు కమిషనర్‌ కాంతిరాణా చెప్పారు. రైలు పట్టాలకు ఆనుకుని ఉన్న ప్రహరీకి ఉన్న రంధ్రాలను మూసివేయాలని నిర్ణయించామని ఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ వల్లేశ్వర్‌ తెలిపారు. స్టేషన్‌ శివారున ఉన్న క్యాబిన్‌ నుంచి రైల్వేయార్డు మీదుగా పట్టాల వెంబడి 250-300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపామని ఆయన వెల్లడించారు.


Read more