Abn logo
Sep 20 2020 @ 02:11AM

భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Kaakateeya

  • 9మంది అల్‌ కాయిదా ఉగ్రవాదుల అరెస్టు
  • పశ్చిమ బెంగాల్‌, కేరళలో అదుపులోకి
  • దేశంలో కీలక ప్రాంతాల్లో దాడులకు కుట్ర
  • సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం
  • బలమైన అల్‌ కాయిదా వ్యవస్థ ఏర్పాటుకు యత్నం
  • పాక్‌ అల్‌ కాయిదా నుంచి ఇంటర్నెట్‌లో సూచనలు
  • ఢిల్లీ, కశ్మీర్‌లో ఆయుధాల సేకరణకు ప్రణాళిక: ఎన్‌ఐఏ
  • బాంబుల తయారీకి బెంగాల్‌ కేంద్రంగా మారింది
  • గవర్నర్‌ ధన్‌ఖర్‌


న్యూఢిల్లీ/కోల్‌కతా, సెప్టెంబరు 19: దేశంలో పాక్‌ ప్రేరేపిత భారీ ఉగ్రకుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఛేదించింది. ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీసేందుకు ప్రణాళిక రచించిన 9 మంది  అల్‌కాయిదా ఉగ్రవాదులను పట్టుకుంది. భారత్‌లో కీలక ప్రాంతాలు, జనం ఎక్కువగా ఉండే చోట్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు వీరంతా కుట్ర పన్నారని తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ముషీరాబాద్‌లో, కేరళలోని ఎర్నాకుళంలో వీరందరినీ ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. ముర్షీద్‌ హసన్‌, ఇయాకుబ్‌ బిశ్వాస్‌, మొసారఫ్‌ హొసేన్‌ అనే ముగ్గురు ఎర్నాకుళంలో పట్టుబడగా నజ్‌మూస్‌ షకీబ్‌, అబు సూఫియాన్‌, మైనుల్‌ మోండాల్‌, లియూ యేన్‌ అహమద్‌, అల్‌ మామున్‌ కమల్‌, అతీతుర్‌ రెహమాన్‌లు ముషీరాబాద్‌లో చిక్కారు. మొత్తం బృందానికి హసన్‌ నాయకత్వం వహిస్తున్నాడు. కేరళలో దొరికిన వారు కూడా పశ్చిమ బెంగాల్‌ వాసులే. పాకిస్థాన్‌లో ఉన్న అల్‌ కాయిదా అగ్రనేతలు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఆరుగురిని ప్రభావితం చేశారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌ ద్వారా వీరికి సూచనలు అందుతున్నాయి. ఈ బృందం చేపట్టిన ఆటోమేటిక్‌ రైఫిల్స్‌, తుపాకులు, పేలుడు సామగ్రి, ఆయుధాల సేకరణ తుది దశలో ఉంది. అబు సూఫియాన్‌ ఇంటి నుంచి పేలుడు పరికరాల (ఐఈడీ) తయారీకి అవసరమైన విడి భాగాలను ఎన్‌ఐఏ సేకరించింది.


నిధుల్ని సమీకరించడంలో ఈ ఆరుగురి బృందం చాలా వేగంగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అల్‌ కాయిదాకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల వద్ద డిజిటల్‌ పరికరాలు, పలు పత్రాలు, జిహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల పట్టివేత నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతపై రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ విమర్శలు గుప్పించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచగల బాం బుల తయారీకి రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారింది. మమత, పోలీసులు రాజకీయంగా ప్రత్యర్థులను ఏరివేయడంపైనే దృష్టి పెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రస్థాయిలో దిగజారిపోవడం వెనుక తమ బాధ్యతారాహిత్యాన్ని వారు కప్పిపుచ్చుకోలేరు’’ అని దుమ్మెత్తిపోశారు. మమత సర్కారు నిఘా వర్గాల వైఫల్యానికి తాజా ఘటన నిదర్శనమని కాంగ్రెస్‌, బీజేపీ విరు చుకుపడ్డాయి. కాగా, దేశ భద్రత అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని టీఎంసీ మండిపడింది.


Advertisement
Advertisement
Advertisement