అమ్మో.. వంతెనలు

ABN , First Publish Date - 2022-04-29T04:44:54+05:30 IST

ఇది ఈ ఒక్క వంతెన పరిస్థితే కాదు. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో వంతెనలు శిధిలావస్థకు చేరి భయంగొల్పుతున్నాయి. దశాబ్దాల కిందట నిర్మించిన వీటి నిర్వహణను సంబంధిత అధికారులు గాలికొదిలేశారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం సైతం మరిచిపోయారు. దీంతో పూర్తిగా ధ్వంసమై

అమ్మో.. వంతెనలు
వీపీ రాజుపేట వద్ద శిథిలావస్థకు చేరిన వంతెన

భయంగొల్పుతున్న బ్రిడ్జిలు, కల్వర్డులు
నిర్వహణ లేక శిథిలావస్థకు చేరిన వైనం
భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసం
ప్రతిపాదనలకు కలగని మోక్షం
నిధులు విదల్చని ప్రభుత్వం
(పాలకొండ)
పార్వతీపురం-పాలకొండ అంతర్‌ రాష్ట్ర రహదారిపై వీపీరాజుపేట వద్ద ఉన్న వంతెన ఇది. రావాడ గెడ్డపై దశాబ్దాల కిందట నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. రక్షణ గోడలు ధ్వంసం కావడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. భారీ వాహనాల రాకపోకల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు, వాహన చోదకులు అసౌకర్యానికి గురవుతున్నారు.

--ఇది ఈ ఒక్క వంతెన పరిస్థితే కాదు. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో వంతెనలు శిధిలావస్థకు చేరి భయంగొల్పుతున్నాయి. దశాబ్దాల కిందట నిర్మించిన వీటి నిర్వహణను సంబంధిత అధికారులు గాలికొదిలేశారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం సైతం మరిచిపోయారు. దీంతో పూర్తిగా ధ్వంసమైన ఈ వంతెనలపై ప్రయాణమంటేనే వాహనచోదకులు, ప్రయాణికులు భయపడిపోతున్నారు. జిల్లా పునర్విభజన నేపథ్యంలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటైంది. దాదాపు ఈ నియోజకవర్గాలన్నీ ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు చెందినవే. అంతర్‌ రాష్ట్ర రహదారులు అధికం. అలాగే నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదీ పరీవాహక ప్రాంతాలు అధికం. అటు తోటపల్లి కాలువలు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రహదారులపై ఎక్కడికక్కడే కల్వర్డులు, వంతెనలు ఉన్నాయి. పెరిగిన వాహన రాకపోకలతో వంతెనలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ తదితర శాఖలు నిర్వహణను గాలికొదిలేశాయి. ఏడాదికేడాది మరమ్మతులకు, కొత్త వంతెనల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం నుంచి నిధులు మాత్రం మంజూరు కావడం లేదు.
 ప్రధాన మార్గాల్లో..
పార్వతీపురం-పాలకొండ రహదారిలో వీపీరాజుపేట జంక్షన్‌ వద్ద రావాడ గెడ్డ, జంపరకోట గెడ్డలపై వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. పురాతన వంతెనలపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించాలని ఇంజనీరింగ్‌ అధికారులు ఆదేశించినా ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి-రామభద్రపురం అంతర్‌ రాష్ట్ర రహదారికి సంబంధించి పారాది సమీపంలో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌ ఆంక్షల్లో భాగంగా ఒడిశా, చత్తీస్‌గఢ్‌ వెళ్లాల్సిన వాహనాలను పార్వతీపురం, పాలకొండ, రాజాం మీదుగా మళ్లిస్తున్నారు. శిథిలవంతెనల పరిస్థితి మరింత తీసికట్టుగా మారుతోంది. పాలకొండ మండలం గోపాలపురం వద్ద ఓనిగెడ్డపై వంతెనతో పాటు అదే మార్గంలో చాలా వంతెనలదీ ఇదే పరిస్థితి. పార్వతీపురం-రాయగడ, పార్వతీపురం-బొబ్బిలి, పార్వతీపురం-పాలకొండ, పాలకొండ-బత్తిలి-హడ్డుబంగి మార్గాల్లో గెడ్డలు, వాగులపై ఉన్న కల్వర్టులు కూడా దయనీయంగా ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ కనీస హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దృష్టిసారించాల్సిన అవసరముంది.

 ప్రతిపాదనలు పంపాం
ప్రధాన వంతెనలు శిథిలావస్థకు చేరుకోవడం వాస్తవమే. వాటి మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరైతే నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభిస్తాం. కొన్నింటికి మరమ్మతు పనులు చేస్తే సరిపోతోంది. ప్రస్తుతం పారాది వంతెన మరమ్మతు పనులతో భారీ వాహనాలు మళ్లించిన మాట వాస్తవమే.
-బి.గౌరీశంకరరావు, ఆర్‌అండ్‌బీ డీఈఈ



Updated Date - 2022-04-29T04:44:54+05:30 IST