నిబంధనలు తుంగలో.. ప్రాణాలు గాలిలో..!

ABN , First Publish Date - 2022-05-17T04:31:09+05:30 IST

నాగార్జునసాగర్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్‌ బంకుల

నిబంధనలు తుంగలో.. ప్రాణాలు గాలిలో..!
గున్‌గల్‌ గేటు వద్ద గల పెట్రోల్‌ బంకు ఎదుట జరిగిన ప్రమాదంలో మరణించిన యువకులు(ఫైల్‌)

  • పెట్రోల్‌ బంకుల వద్ద కనిపించని  ప్రమాద సూచికలు, బారీకేడ్లు
  • వేగంగా వెళ్తూ ప్రమాదాలబారిన పడుతున్న వాహనదారులు
  • పట్టించుకోని అధికారులు, బంకు నిర్వాహకులు


యాచారం, మే 16 : నాగార్జునసాగర్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్‌ బంకుల వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. యాచారం మండల పరిధిలోని పెట్రోల్‌ బంకుల వద్ద ఎలాంటి ప్రమాద సూచికలు, బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాదారులు అతివేగంతో దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. బంకుల నిర్వాహకులు కూడా నియమ నిబంధనలు పాటించకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పెట్రోల్‌ పోసుకోవడానికి ఒక్కసారిగా బంకుల్లోకి వాహనాలు మలపడం, రాంగ్‌ రూట్‌లో బంకు వద్దకు రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద సూచికలు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించ వచ్చని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. 

ఈ రహదారిపైనే పలు పెట్రోల్‌ బంకుల వద్ద అనేక ప్రమాదాలు చోటుచేసుకొని పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఫిబ్రవరి 6న గున్‌గల్‌ గేటు వద్ద గల పెట్రోల్‌బంకు ఎదుట కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ నగర శివారులోని శేరిలింగంపల్లి సమీపంలోని ఇంద్రానగర్‌కాలనీ, వట్టినాగులపల్లి కాలనీలకు చెందిన త్యాలపల్లి రామకృష్ణ(27), శ్రీకాంత్‌గౌడ్‌(26) ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో వీరిద్దరి తలలు పగిలి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇదే ప్రమాదంలో మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిపై ఆధారపడిన రెండు కుటుంబాలు నేడు వీధిన పడ్డాయి. ఈనెల 10న తమ్మలోనిగూడ గేటు వద్ద బైక్‌ను కారు ఢీకొట్టడంతో మేడిపల్లికి చెందిన ముచ్చర్ల రాములు(56) అతని కుమారుడు సోను(11) తీవ్రంగా గాయపడి దుర్మరణం పాలయ్యారు. తండ్రీకొడుకు మృతిచెందడంతో వారి కుటుంబం రోడ్డున ప డింది. కుటుంబాన్ని పోషిస్తున్న పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం నేడు దినమొక గండంగా కాలం వెల్లదీస్తోంది. ఇటీవలే యాచారంలోని పెట్రోల్‌ బంకు వద్ద ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తమ్మలోనిగూడ గేటు వద్ద కారు, బస్సు ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్‌ వరుణ్‌గౌడ్‌(21) దుర్మరణం పాలయ్యాడు. పెట్రోల్‌ బంకుల వద్ద ప్రమాదాలు జరగకుండా ఆర్‌అండ్‌బీ పోలీ్‌సశాఖల అధికారులు సంయుక్తంగా తగు భద్రతా చర్యలు తీసుకోవాలని మండల వాసులుకోరుతున్నారు. 


ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

పెట్రోల్‌ బంకుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగు భద్రతా చర్యలు తీసుకుంటాం. బంకులోకి వచ్చి పోయే వాహనాదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరుతున్నాం. బంకుల సమీపంలో వాహనాదారులు కాస్త వేగం తగ్గించి వెళ్తే చాలావరకు ప్రమాదాలను నివారించవచ్చు.

- లింగయ్య, యాచారం ఇన్‌స్పెక్టర్‌ 



Updated Date - 2022-05-17T04:31:09+05:30 IST