Abn logo
Sep 20 2021 @ 00:32AM

‘చెద’రిన ఓట్లు

ఆమదాలవలస కేంద్రంలో ఓటరు స్లిప్పులకు చెదలు పట్టిన దృశ్యం

 బ్యాలెట్‌ బాక్సుల్లో ఓట్ల స్లిప్పులకు చెదలు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ఆమదాలవలస/రూరల్‌/పలాస/కవిటి)

కొన్ని బ్యాలెట్‌ బాక్సుల్లో ఓట్ల స్లిప్పులకు చెదలు పట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఎన్నికలు నిర్వహించారు. లెక్కింపు విషయమై కోర్టు వివాదాల నేపథ్యంలో ఆలస్యమైంది. సుమారు ఐదు నెలల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టగా.. చాలా బ్యాలెట్‌ బాక్సులకు చెదలు పట్టాయి. బాక్సులు తెరవగానే చెదలతోపాటు చెదకారణంగా ముక్కలైన ఓట్లు లభ్యమయ్యాయి. దీంతో ఈ ఓట్లను ఎలా లెక్కించాలని అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు కలెక్టర్‌ ఆదేశాలతో ఓ నిర్ణయం తీసుకున్నారు. గెలుపొందిన అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే.. చెదలు పట్టిన ఓట్లు తక్కువగా ఉంటే మరి లెక్కించనవసరం లేదని నిర్ణయించారు. 

- ఆమదాలవలస మండలం కట్యాచారిపేట ఎంపీటీసీ స్థానానికి 1,745 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఎంపీటీసీ స్థానానికి 620, జడ్పీటీసీ స్థానానికి చెందిన 620 ఓట్లు చెదలు కారణంగా  దెబ్బతిన్నాయి. ఎంపీటీసీకి సంబంధించి మిగిలిన ఓట్లు లెక్కించగా.. టీడీపీ అభ్యర్థికి 586 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 446 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు ఫలితాన్ని ప్రకటించలేదు. మళ్లీ ఎన్నికల నిర్వహించాలని ఆర్వో ఆర్‌.శ్రీరాములకు టీడీపీ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. బ్యాలెట్‌ పత్రాలు చెదపట్టిన విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువెళ్తామని ఎన్నికల అధికారులు చెప్పారు. 

- సరుబుజ్జిలి మండలం షలంత్రిలో ఎంపీటీసీకి 34 ఓట్లు, జడ్పీటీసీ 36 ఓట్లకు చెదలు పట్టాయి. ఇదే మండలం రొట్టవలసలో ఎంపీటీసీకి 283 ఓట్లు, జడ్పీటీసీకి 228 ఓట్లకు నష్టం కలిగింది.

- మందస మండలంలోని అంబుగాం ప్రాదేశికంలో  బ్యాలెట్‌బాక్స్‌కు చెదలు పట్టాయి. 48 ఓట్లు చెదలు పట్టి పాడైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటించలేదు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తరువాత ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. ఇదే మండలం రామ్‌పురంలో ఎంపీటీసీకి 133 ఓట్లు, జడ్పీటీసీకి 149 ఓట్లు చెదలు పట్టాయి. జిల్లుండలో ఎంపీటీసీకి 75, జడ్పీటీసీకి 100 ఓట్లు పాడయ్యాయి. 

- గార మండలం సతివాడలో ఎంపీటీసీకి 32 ఓట్లు, జడ్పీటీసీకి 31 ఓట్లు చెదలు పట్టాయి.  

- కవిటి మండలంలోని  68వ పోలింగ్‌ కేంద్రం బాక్స్‌లో కొన్ని ఓట్లకు చెదలు పట్టాయి. దీంతో కవిటి-3 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఫలితాలను ప్రకటించడం లేదని రిటర్నింగ్‌ అధికారి పి.వాసుదేవరావు తెలిపారు. కవిటి ఎంపీటీసీ-3 పరిధిలో 14 ఓట్లు, జడ్పీటీసీకి సంబంధించి 37 ఓట్లు చెదలు పట్టినట్లు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టిలో పెట్టి అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని ఆర్వో తెలిపారు.