పంచాయతీ కార్మికుల్లో అలజడి

ABN , First Publish Date - 2021-07-15T06:27:57+05:30 IST

గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికుల్లో అలజడి నెలకొంది. దీర్ఘకాలంపాటు పంచాయతీలనే నమ్ముకొని పనిచేస్తున్న వారు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

పంచాయతీ కార్మికుల్లో అలజడి

టెండర్ల విధానంతో కొత్త నియామకాలు

తాము నష్టపోతామంటూ ఆందోళన

హైకోర్టు, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌  ఉత్తర్వుల అమలు కోసం ఒత్తిడి

జిల్లాలో పనిచేస్తున్న 1,256 మంది రోడ్డున పడే ప్రమాదం

ఒంగోలు (కలెక్టరేట్‌), జూలై 14 : గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికుల్లో అలజడి నెలకొంది. దీర్ఘకాలంపాటు పంచాయతీలనే నమ్ముకొని పనిచేస్తున్న వారు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి మద్దతుదారులు కార్మికులుగా చేరేందుకు ముందుకు వస్తుండటంతో అనాదిగా పని చేస్తున్న వారు రోడ్డున పడాల్సి వస్తోంది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఒకవైపు కనీస వేతనం అమలుచేస్తామని చెబుతూనే మరోవైపు గ్రామ పంచాయతీల్లో టెండర్ల ద్వారా కార్మికులను నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో తాము తక్కువ వేతనానికి పనిచేయలేక రోడ్డున పడుతామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.


జిల్లాలో పనిచేస్తున్న 1,256 మంది కార్మికులు

జిల్లాలో ఆయా పంచాయతీల వనరులకు అనుగుణంగా కార్మికులు పనిచేస్తుంటారు. ఆవిధంగా జిల్లాలో 500లకుపైగా గ్రామపంచాయతీల్లో 1,256 మంది ఏడు రకాల విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గతంలో ఆ కార్మికులు టెండర్ల ద్వారా పనిచేసేవారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు టెండర్‌ విధానాన్ని తప్పుబట్టింది. దీంతో 2015 నుంచి ఏటా రెన్యువల్‌ చేసే విధానం అమల్లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం పలు పంచాయతీల్లో టెండర్ల ద్వారా కార్మికులను నియమించేందుకు కార్యదర్శులు శ్రీకారం చుట్టడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. టెండర్‌ వేసే వారు తక్కువ కోడ్‌ చేస్తే అటువంటి వారికి అవకాశం కల్పిస్తారు. ఇప్పటివరకు పనిచేసిన కార్మికులు పరిస్థితి అగమ్యగోచరమే.


హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి

పంచాయతీల్లో కార్మికులను నియమించేందుకు టెండర్‌ విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు 2015లో తీర్పు ఇచ్చింది. దాన్ని అమలుచేయాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. వాటిని అమలు చేయాలని జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంచాయతీలకు ఆదేశాలు వచ్చినా పట్టించుకుంటున్న పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు కార్మికులు రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Updated Date - 2021-07-15T06:27:57+05:30 IST