పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-05-17T05:41:10+05:30 IST

నెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వంచేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా అధికారులను ఆదేశించారు.

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమా అగర్వాల్‌

 రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా

కరీంనగర్‌, మే 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ నెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వంచేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేనతో కలిసి పదో తరగతి పరీక్షల నిర్వహణపై  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్య ఎదురైందని, మన రాష్ట్రంలో ఆ సమస్య ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చివరి అరగంట సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, అవసరమైన మేరకు పోలీసు 


బందోబస్తు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లను జిల్లాలకు తరలించామని, పరీక్షా కేంద్రాల వద్దకు ఓంఆర్‌ షీట్లను తరలించి వెరిఫై చేయాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి పర్యవేక్షణలో మాత్రమే ప్రశ్నపత్రాలను ఓపెన్‌ చేయాలని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు కనీసం 45 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సుల రూట్‌ మ్యాపింగ్‌ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో ఎలాంటి ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌ అనుమతించవద్దని, విద్యార్థులను తనిఖీ చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది ఐడెంటిటీ కార్డులు 


వెంట తీసుకొచ్చుకోవాలని సూచించారు. అనంతరం మన ఊరు-మనబడి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. మన ఊరు-మనబడి కింద మొదటి దశలో ఎంపికైన పనులకు పరిపాలన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని, మంజూరు చేసిన పనులను క్షేత్రస్థాయిలో గ్రౌండ్‌ చేయాలని ఆదేశించారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేన మాట్లాడుతూ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు ముందస్తుగా పరిశీలించాలని సూచించారు. కాంపోజిట్‌ కోర్సు విద్యార్థులకు మొదటి లాంగ్వేజ్‌ పరీక్ష 2 పేపర్లు అదేరోజు ఉదయం నిర్వహిస్తామని, ఉదయం 9:30 నుంచి 11:45 ఒక పేపర్‌, 11:45 నుంచి 12:45 గంటల వరకు రెండో పేపర్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, డీఈవో జనార్దన్‌రావు, డీపీవో వీరబుచ్చయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతా రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:41:10+05:30 IST