పది పరీక్షలకు సిద్ధం

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి జూన్‌ 1 వరకు జరగనున్న పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 438 పాఠశాలల్లో 16,425 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇందులో 8,245 మంది బాలురు, 8,180 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 83 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు 83 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 83 మంది డిపార్ట్మెంట్‌ అధికారులు, 904 మంది ఇన్విజిలేటర్లు, 9 మంది రూట్‌ అధికారులు, ఐదుగురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను నియమించారు.

పది పరీక్షలకు సిద్ధం
హుస్నాబాద్‌లో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఈవో రవికాంతరావు

గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి   

ఐదు నిమిషాలు ఆలస్యమైతే అనుమతి లేదు


సిద్దిపేట క్రైం, మే 22 : పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి జూన్‌ 1 వరకు జరగనున్న పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 438 పాఠశాలల్లో 16,425 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇందులో  8,245 మంది బాలురు, 8,180 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 83 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు 83 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 83 మంది డిపార్ట్మెంట్‌ అధికారులు, 904 మంది ఇన్విజిలేటర్లు, 9 మంది రూట్‌ అధికారులు, ఐదుగురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను  నియమించారు. 


సీసీ కెమెరాలతో నిఘా

పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం కోసం అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో సహకారంతో పరీక్షల ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. ఆరోగ్యం పరమైన సమస్యలు తలెత్తినపుడు పరిష్కరించడం కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పరీక్షా సమయానికి గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చూడాలని అధికారులు తల్లిదండ్రులకు సూచించారు. ఐదు నిమిషాలు ఆలస్యమయితే కేంద్రంలోకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. 


ఆరు పరీక్షలే..

కరోనా సంక్షభంతో పాఠశాలలు మూతపడినందున విద్యార్థుల చదువు గాడి తప్పింది. ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించినా అనేక ఇబ్బందులతో ఒత్తిడికి లోనయ్యారు. రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేక పోయారు. దీంతో మానసిక ఆందోళనకు లోనవుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడం సులభతరం చేయడం కోసం ఏర్పాట్లు చేశారు. పదో తరగతిలో 11 పరీక్షలకు బదులు ఈసారి ఆరు పరీక్షలే నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రంలో 50 శాతం ఛాయిస్‌ ఇస్తూ రూపొందించారు. పరీక్షా సమయాన్ని గతంలో కంటే ఈ సారి ఎక్కువ కేటాయించారు. పరీక్ష రాయడానికి 3:15 గంటల సమయాన్ని ఇచ్చారు.  ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST