పది.. ప్రశ్నార్థకం..

ABN , First Publish Date - 2022-05-03T05:52:58+05:30 IST

పది.. ప్రశ్నార్థకం..

పది.. ప్రశ్నార్థకం..
పసుమర్రు జడ్పీ పాఠశాలలో జవాబు స్లిప్పులు సిద్ధం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులను విచారిస్తున్న విద్యాశాఖ, పోలీసు అధికారులు

ఆంధ్రజ్యోతి పరిశీలన

రెండు జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు అస్తవ్యస్తం

డోకిపర్రు పరీక్షా కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌

పసుమర్రు జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుల నిర్వాకం

స్లిప్పులు సిద్ధం చేస్తూ దొరికిపోయిన టీచర్లు

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సమాచారంతో బయటపడిన బాగోతం

ఏడుగురిపై వేటు 

జగ్గయ్యపేటలోనూ మాస్‌ కాపీయింగ్‌ ఆరోపణలు

నందిగామ, కంచికచర్లలో బిట్‌ పేపర్‌ లీక్‌

ఇన్‌చార్జి ఎంఈవోలతో పరీక్షలు మమ..


‘పేపర్‌ టైట్‌.. అయాం వెయిటింగ్‌..’  పసుమర్రు జడ్పీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి సెల్‌ఫోన్‌లో పోలీసులు కనుగొన్న మెసేజ్‌ ఇది. ఈ ఒక్క మెసేజ్‌.. జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణా తీరును స్పష్టంగా తెలియజేస్తోంది. తమ విద్యార్థులంతా పాసైపోవాలని కొందరు ఉపాధ్యాయులు.. తమ స్కూలే జిల్లాలో నెంబర్‌ వన్‌ కావాలని మరికొందరు ప్రధానోపాధ్యాయులు చేస్తున్న మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారం విద్యార్థుల భవితను ప్రశ్నార్థకం చేస్తోంది. కీలకమైన మొదటి అడుగునే తడబడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తీరును ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం పరిశీలించింది. ఆ వివరాలు..

పామర్రు/హనుమాన్‌జంక్షన్‌/నందిగామ, మే 2 : ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లోని 1,009 పాఠశాలల నుంచి 49,050 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఏప్రిల్‌ 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందనగా, 10 నిమిషాల ముందే బయటి గేట్లు మూసివేస్తారు. ప్రధాన గేట్ల వద్ద పోలీసుల కాపలా ఉంటుంది. ఇతరులను లోపలకు అనుమతించరు. ఇదంతా బయటకు కనిపించే హడావుడి. కొన్ని పరీక్షా కేంద్రాల్లోకి బయటి నుంచి యథేచ్ఛగా స్లిప్పులను తీసుకెళ్తుండగా, వాటిని ఉపాధ్యాయులే స్వయంగా అందిస్తుండటం గమనార్హం. పామర్రు మండలం పసుమర్రు జడ్పీ స్కూల్‌ ఉదంతమే ఇందుకు నిదర్శనం. పరీక్షా కేంద్రాల్లో సైతం ఉపాధ్యాయుల కనుసన్నల్లోనే మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందనే  ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జగ్గయ్యపేటలో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రధాన నాయకుడొకరు చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ ఆఫీసర్లను చూసీచూడనట్టు ఉండాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఫలితంగానే ఈ ప్రాంతంలో మాస్‌ కాపీయింగ్‌ యథేచ్ఛగా జరుగుతోంది. నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లోని పలు కేంద్రాల్లో చివరి ఐదు నిమిషాల్లో బిట్‌ పేపరు చెబుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఉపాధ్యాయులే స్లిప్పులు తీసుకెళ్తూ.. 

పామర్రు మండలంలోని పసుమర్రు జడ్పీ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జడ్పీ పాఠశాలలో పరీక్ష రాస్తున్నారు. తమ విద్యార్థులు నూరుశాతం పాసవ్వాలనే ఉద్దేశంతో పసుమర్రు జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులే స్వయంగా జవాబులు సిద్ధంచేసి, విద్యార్థులకు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష ప్రారంభమైన వెంటనే ఉదయం 9.30 గంటలకు ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్‌లో తెప్పించుకుంటున్న పసుమర్రు ఉపాధ్యాయులు వాటికి జవాబులు సిద్ధం చేసుకుని, జిరాక్సు కాపీలు తీసుకుని పాఠశాలకు వెళ్లి తమ విద్యార్థులకు ఇస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో పసుమర్రు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో పాటు నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సోమవారం అధికారులు వారి సెల్‌ఫోన్లను పరిశీలించగా, ప్రశ్నాపత్రాలతోపాటు ‘పేపర్‌ టైట్‌.. అయాం వెయిటింగ్‌..’ అనే సందేశాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పసుమర్రు హైస్కూల్‌కు చెందిన వై.సురేష్‌ (ఎస్‌ఎస్‌, ఎస్‌ఏ), పి.జ్ఞానానందం (బీఎస్‌, ఎస్‌ఏ), బి.రత్నకుమార్‌ (గణితం, ఎస్‌ఏ), కె.వరప్రసాద్‌ (గణితం, ఎస్‌ఏ), కె.తిరుమలేశ్‌ (గణితం, ఎస్‌ఏ), సీహెచ్‌ వెంకయ్య చౌదరి (పీఎస్‌, ఎస్‌ఏ), ఎంఎల్‌డి శ్రీనివాస్‌ (బీఎస్‌, ఎస్‌ఏ)ను సస్పెండ్‌ చేశారు. 

పర్యవేక్షణకు ఇన్‌చార్జులే దిక్కు

జిల్లాల విభజన ప్రభావం పదో తరగతి పరీక్షల పర్యవేక్షణపై పడింది. చాలా మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈవోల పర్యవేక్షణలోనే పరీక్షలు జరుగుతున్నాయి. బాపులపాడు మండలంలో ఇన్‌చార్జి ఎంఈవో (మండల విద్యాశాఖాధికారి) బదిలీపై వెళ్లడంతో, మరో ఇన్‌చార్జిని నూతనంగా నియమించారు. పామర్రు ఎంఈవోగా పనిచేస్తున్న విజయలక్ష్మి ప్రస్తుతం రెండు మండలాలకు (బాపులపాడు, నందివాడ) ఇన్‌చార్జిగా ఉన్నారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. బాపులపాడు మండలవ్యాప్తంగా ఎనిమిది పరీక్ష కేంద్రాలకు గానూ ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో, మూడు ప్రైవేట్‌ పాఠశాలల్లో పరీక్ష జరుగుతోంది. రేమల్లె, రంగన్నగూడెం వంటి  గ్రామాల్లో అభివృద్ధి చెందిన ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉన్నా, ప్రైవేట్‌ పాఠశాలల్లో పది పరీక్షలు నిర్వహించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 



Read more