Breaking : చివరి నిమిషంలో ఏపీ టెన్త్ ఫలితాలు వాయిదా.. అసలేం జరిగింది..?

ABN , First Publish Date - 2022-06-04T17:12:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్‌ దేవానంద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు..

Breaking : చివరి నిమిషంలో ఏపీ టెన్త్ ఫలితాలు వాయిదా.. అసలేం జరిగింది..?

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి  పరీక్షా ఫలితాలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్‌ దేవానంద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తుండగా సడన్‌గా ఇలా ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీంతో అటు విద్యార్థులు.. ఇటు పేరెంట్స్ అందరూ తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. కాగా.. సోమవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.


చివరి నిమిషంలో జరిగిందిదీ..

పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడడానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని తెలుస్తోంది. మంత్రి బొత్సకు సమాచారం ఇవ్వకుండా అధికారులే ఫలితాల ప్రకటన చేసినట్లుగా సమాచారం. దీంతో అధికారులు తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి ఫలితాలను వాయిదా వేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాల ఆందోళన

విజయవాడ: పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా ప్రణాళిక ప్రకారం విడుదల చేయలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మంత్రి, అధికారుల మధ్య సమన్వయం లేదని ఫలితాలు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు. ర్యాంకులు ప్రకటిస్తే.. జరిమానా అని‌ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పుడు అర్ధంతరంగా ఫలితాలు వాయిదా వేశారని తెలిపారు. మరి అధికారులు, ప్రభుత్వానికి ఎటువంటి జరిమానా వేయాలని నిలదీశారు. ఆరు లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారా... దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 


‘కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ సీఎం... ఫలితాల వాయిదా ఎంతవరకు సమంజసం?

అమరావతి:  కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy).. 10వ తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేయటం ఎంతవరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(Achennaidu) ప్రశ్నించారు. పరీక్ష ఫలితాలు ‎ చివరి నిమిషంలో ఎందుకు వాయిదా వేశారో సీఎం, మంత్రి విద్యార్దులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ చేతకాని పాలనతో విద్యార్దుల భవిష్యత్‌తో ఆటలాడుతారా?  అని నిలదీశారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని... జగన్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని చేశారని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య ‎మంత్రి బొత్స సత్యనారాయణకు తెలుసా? అని అడిగారు. జగన్ రెడ్డి తన అనాలోచిత, అహంకారపూరిత నిర్ణయాలతో విద్యార్దుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారాయన్నారు. నాడు నేడు పేరుతో కమీషన్లు దండుకోవటం తప్ప విద్యాభివృద్దికి జగన్ రెడ్డి చేసిన కృషి శూన్యమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-06-04T17:12:54+05:30 IST