రి..మార్కులు

ABN , First Publish Date - 2022-05-12T06:01:52+05:30 IST

రి..మార్కులు

రి..మార్కులు
జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (ఫైల్‌ ఫొటో)

పది జవాబు పత్రాల మూల్యాంకన రేట్లపై టీచర్ల గుర్రు

గతంలో 50 మార్కుల పేపరుకు రూ.6.60

ఇప్పుడు 100 మార్కుల పేపరుకూ అదే రేటు

రేట్లను రెట్టింపు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్‌ 

60 ఏళ్లు పైబడిన వారికి డ్యూటీలపై ఆగ్రహం

రేపటి నుంచి మచిలీపట్నంలో పది మూల్యాంకనం


2016లో 50 మార్కుల పరీక్ష పేపర్‌ దిద్దినందుకు రూ.6.60 ఇచ్చేవారు. ఏడేళ్ల తరువాత ఇప్పుడు 100 మార్కుల పరీక్ష పేపర్‌ దిద్దినందుకు కూడా అదే మొత్తం ఇస్తామంటున్నారు. మార్కులు పెరిగినా.. తమకిచ్చే రేటు మాత్రం పెరగలేదంటూ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.


గుడివాడ, మే 11 : పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఈనెల 13 నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. ఇందుకు మచిలీపట్నంలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా సబ్జెక్టుల్లో మూడేళ్లు పైబడి అనుభవం ఉన్న వారిని ఎవాల్యుయేటర్లుగా ఎంపిక చేశారు. జిల్లాలోని 823 మంది ఉపాధ్యాయులను ఎవాల్యుయేటర్లుగా అంటే.. అసిస్టెంట్‌ ఎగ్జామినర్లుగా, 135 మందిని చీఫ్‌ ఎగ్జామినర్లుగా, 274 మందిని స్పెషల్‌ అసిస్టెంట్లుగా నియమించారు. వయస్సు 60 పైబడిన వారిని మూల్యాంకనం నుంచి మినహాయించాలనే నిబంధన ఉన్నా పరిగణించకుండా స్పాట్‌ వాల్యుయేషన్‌ విధులు వేయడం విమర్శలకు తావిస్తోంది. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, ప్రత్యేక వైద్య కారణాలు ఉన్నవారిని మినహాయించాలని కోరుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే, పది రోజుల పాటు ఇరుకు గదుల్లో ఎలా ఉండగలరని, కనీసం ఎయిర్‌కూలర్లయినా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

రేట్లు రెట్టింపు చేయాలి

మూల్యాంకనం రేటు రెట్టింపు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పరీక్ష పత్రాలు 50 మార్కులకు ఉండేవి. కొవిడ్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వం పేపర్ల సంఖ్యను ఏడుకు తగ్గించింది. దీంతో వంద మార్కుల పేపరును మూల్యాంకనం చేయాల్సి వస్తోంది. గతంలో 50 మార్కుల పేపర్‌ మూల్యాంకనానికి రూ.6.60 ఇచ్చేవారు. ప్రస్తుతం వంద మార్కుల పేపరుకు కనీసం రూ.13 ఇవ్వాల్సి ఉండగా, ఎప్పుడో 2016లో నిర్ణయించిన రూ.6.60 ఇస్తారేమోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మార్కులకు మూల్యాంకనం రేట్లు రెట్టింపు చేయాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు మూల్యాంకన కేంద్రాల్లో ఏర్పాట్లపై సమీక్షిస్తూ మంచినీరు, మజ్జిగ కూడా సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులంతా రేట్లు రెట్టింపు చేయమంటే, మజ్జిగతో సరిపెడతారా అంటూ వ్యంగ్యంగా నిరసన తెలుపుతున్నారు.

రేట్లు ఇవీ..

క్యాంప్‌ ఆఫీసర్‌ (డీఈవో)కు రోజుకు రూ.385, డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్లకు రూ.330, ఏసీవోలకు రూ.286, సీఈలకు రూ.264, ఒక పేపర్‌ దిద్దినందుకు రూ.6.60, స్పెషల్‌ అసిస్టెంట్లకు రోజుకు రూ.137.50 చెల్లిస్తున్నారు. 


పేపర్‌కు రూ.15 ఇవ్వాలి

వంద మార్కుల పేపర్‌ దిద్దుతున్నాం. పేపరుకు రూ.15 ఇవ్వాలి. 55 ఏళ్లు దాటిన వారికి, వ్యాధులతో బాధపడుతున్న వారికి మూల్యాంకనంలో మినహాయింపు ఇవ్వాలి. ఇప్పటికే డీఈవో తాహెరా సుల్తానాను కోరగా, ఆమె సానుకూలంగా స్పందించారు.  

- డి.చంద్రశేఖర్‌, స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడు, ఎస్టీయూ


Read more