పట్టాభి ఇంటి వద్ద హైడ్రామా

ABN , First Publish Date - 2021-10-21T06:53:19+05:30 IST

పట్టాభి ఇంటి వద్ద హైడ్రామా

పట్టాభి ఇంటి వద్ద హైడ్రామా
గురునానక్‌ కాలనీలోని పట్టాభి ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు

ఉదయం నుంచి భారీగా పోలీసుల మోహరింపు

అనూహ్య పరిణామాల మధ్య అరెస్టు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి వద్ద బుధవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు కనిపించాయి. తనను ఏవిధంగానైనా అరెస్టు చేస్తారని పట్టాభి అనుమానించినట్టుగానే బుధవారం రాత్రికి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభి అరెస్టు చేస్తారన్న వార్త బయటకు రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి బారులు తీరారు. ఈ పరిణామంతో గురునానక్‌ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

పట్టాభి ఇల్లు దిగ్బంధనం

పట్టాభి ఇంటి వద్ద మధ్యాహ్నం నుంచి పోలీసు బలగాల సంఖ్యను పెంచారు. ఉదయం నుంచి రాత్రి వరకు తలుపులు వేసుకుని పట్టాభి ఇంట్లోనే ఉన్నారు. పోలీసుల సంఖ్య పెరగడం, కార్యకర్తలు తరలిరావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తొలుత పోలీసులు పట్టాభిని బయటకు పిలిచి, అరెస్టు నోటీసు ఇచ్చి స్టేషన్‌కు తరలించాలని భావించారు. ఇందుకోసం పలుమార్లు పట్టాభి ఇంటి తలుపులు తట్టారు. కాలింగ్‌ బెల్‌ మోగించారు. అరెస్టు విషయాన్ని ముందే గ్రహించిన ఆయన ప్రధాన ద్వారం, వంటగది తలుపులకు లోపల తాళాలు వేసుకుని ఇంట్లోనే ఉన్నారు. దీనివల్ల పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆయన బయటకు రాలేదు. చివరికి పోలీసులు తమ కార్యాచరణలోకి దిగారు. వంట గది తలుపు పైన గడియలను పగలగొట్టారు. ఆ మార్గం ద్వారా లోపలకు ప్రవేశించారు. తొలుత ప్రధాన ద్వారం పగలగొట్టాలని భావించినా సాధ్యం కాలేదు. లోపలకు వెళ్లిన వెంటనే పట్టాభిని చుట్టుముట్టారు. గవర్నరుపేట పోలీసులు ఇచ్చిన సీఆర్పీసీ 50(2) నోటీసు ఆయన భార్య చందన చేతిలో పెట్టారు. రెండు నిమిషాల పాటు మాట్లాడాక ‘ఇక పదండి..’ అని పట్టాభిని బయటకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసు జీపు ఎక్కించి తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టాభిని విజయవాడలో మూడో ఏసీఎంఎం న్యాయస్థానంలో గురువారం హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. పట్టాభి ఇంటికి వచ్చిన నాయకులను, కార్యకర్తలను లోపలకు వెళ్లనివ్వలేదు. ఆయన ఇంటికి మొత్తం నాలుగు మార్గాలు ఉన్నాయి. ఆ వీధులను మొత్తం పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. చుట్టుపక్కల వారిని బయటకు రానివ్వలేదు. ప్రతి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయకులు గానీ, కార్యకర్తలు గానీ తోసుకుని రాకుండా రెండువైపులా రోప్‌ పార్టీలను నియమించారు. ఉదయం నుంచి పట్టాభి ఇంటి వద్ద ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

న్యాయపోరాటం చేస్తాం : చందన

తన భర్తను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారని పట్టాభి సతీమణి చందన ఆరోపించారు. తమ ఇంట్లో దాడి చేసిన వారిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసు కస్టడీలో తన భర్తకు ఏం జరిగినా దానికి సీఎం, డీజీపీ బాధ్యత వహించాలని హెచ్చరించారు. జరిగిన పరిణామాలపై తాము న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. 

Updated Date - 2021-10-21T06:53:19+05:30 IST