Kakinada జీజీహెచ్‌ దగ్గర ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2022-05-21T20:43:18+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మాజీ డ్రైవర్ Dead Body దొరికిన ఘటన ఇప్పుడు..

Kakinada జీజీహెచ్‌ దగ్గర ఉద్రిక్తత..

కాకినాడ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మాజీ డ్రైవర్ Dead Body దొరికిన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. అసలేం జరిగిందో పోలీసులు తేల్చి.. ఎమ్మెల్సీని శిక్షించాలని ప్రజా సంఘాలు, ప్రధాన  ప్రతిపక్షమైన టీడీపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఘటనలో నిజానిజాలేంటని తెలుసుకోవడానికి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కాకినాడలోని జీజీహెచ్ (GGH) ఆస్పత్రికి వచ్చింది. మార్చురీ గదిలోకి చొచ్చుకుని వెళ్లేందుకు కమిటీ సభ్యులు యత్నించగా జీజీహెచ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో టీడీపీ (TDP) శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు-టీడీపీ కార్యకర్తలు, కమిటీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా బారికేడ్లు తోసుకుని మరీ టీడీపీ కార్యకర్తలు ముందుకెళ్లారు. 


దీంతో పోలీసులు- టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతబాబును అరెస్ట్‌ చేయాల్సిందేనని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. ప్రస్తుతం జీజీహెచ్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తెదేపా నాయకులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు గాయపడ్డారు. దీంతో ఆయన్ను జీజీహెచ్‌లోకి తీసుకెళ్లి వైద్యం అందించారు. మరోవైపు సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఎమ్మెల్సీని అరెస్ట్‌ చేసే వరకూ తాము సంతకం చేయబోమని అతని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. పోస్టుమార్టం నిలిచిపోయింది.


విశాఖలో ఆందోళన..

మరోవైపు.. విశాఖపట్నంలోనూ దళిత సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. అనంతబాబును అరెస్టు చేసి.. ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని దళిత సంఘాలు కోరుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే..  ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Updated Date - 2022-05-21T20:43:18+05:30 IST