ఏపీలో జీతాల టెన్షన్

ABN , First Publish Date - 2021-09-01T16:47:40+05:30 IST

అమరావతి: ఏపీలో జీతాలు, తీసుకున్న అప్పులకు వడ్డీల చెల్లింపుల టెన్షన్ ప్రారంభమైంది.

ఏపీలో జీతాల టెన్షన్

అమరావతి: ఏపీలో జీతాలు, తీసుకున్న అప్పులకు వడ్డీల చెల్లింపుల టెన్షన్ ప్రారంభమైంది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలంకు వెళ్లిన ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్లు వచ్చాయి. జీతాలు, పెన్షన్లకు ఈ నిధులు ఒక మూలకు రాకపోవడంతో జీఎస్టీ చెల్లింపులు రాష్ట్రానికి నెలాఖరులో వచ్చే ఆదాయం కోసం వెతుక్కుంటున్నారు. సెప్టెంబర్‌లో కూడా వాయిదా పద్ధతిలోనే జీతాలు, పెన్షన్ల విడుదల ఉంటుందని తేలిపోయింది.


ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు సకాలంలో పడడంలేదు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో పెన్షనర్లకు 15వ తేదీ వరకు కూడా డబ్బులు పడడంలేదు. ఉద్యోగులకు కూడా దశలవారీగా 10వ తేదీ వరకు జీతాలు వేస్తునే ఉన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ల కోసం రూ. 5,500 కోట్లు, సామాజిక భద్రత పెన్షన్లకు రూ. 15వందల కోట్లు, తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద రూ. 4వేల కోట్లు ప్రతి నెల చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తం రూ. 11వేల కోట్లు 1వ తేదీ నాటికి ప్రభుత్వ ఖజానాలో ఉండాలి. ప్రస్తుతం ఖజానాలో నిధులు లేవు. సామాజిక భద్రతా పెన్షన్లు 1న వాలంటీర్లు ఇస్తున్నారని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం.. గత నెలలో వాటిని కూడా సకాలంలో అందించలేకపోయింది. సెప్టెంబర్ 1 నుంచి జీతాలు సక్రమంగా చెల్లిస్తారని కొంతమంది చెబుతున్నప్పటికీ ఆచరణలో సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే నిధుల ఆధారంగా జీతాలు, పెన్షన్లు చెల్లించ నున్నారు. ఈ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఓడీకి వెళ్లాల్సి ఉంది. దీనిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2021-09-01T16:47:40+05:30 IST