వాడనర్సాపురంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-08-14T05:58:11+05:30 IST

మండలంలోని వాడనర్సాపురంలో శనివారం జరగాల్సిన మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు వాయిదా పడ్డాయి. గతంలో మాదిరిగా చేతులెత్తే పద్ధతిలో కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరపాలని టీడీపీ మద్దతుదారులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వాడనర్సాపురంలో ఉద్రిక్తత
గుమికూడిన వైసీపీ, టీడీపీ మద్దతుదారులతో మాట్లాడుతున్న ఎన్నికల అధికారిణి ఆశాజ్యోతి.

మత్స్యకార సహకార సంఘం ఎన్నికలపై రగడ

చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహణకు అధికారి సన్నద్ధం

టీడీపీ నాయకులు అభ్యంతరం

బ్యాలెట్‌ విధానంలో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినట్టు వెల్లడి

ఉత్తర్వులు చూపించాలని వైసీపీ నాయకులు పట్టు

ప్రభుత్వ న్యాయవాదిని వాకబు చేసిన ఎన్నికల అధికారి

కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడి


రాంబిల్లి, ఆగస్టు 13: మండలంలోని వాడనర్సాపురంలో శనివారం జరగాల్సిన మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు వాయిదా పడ్డాయి. గతంలో మాదిరిగా చేతులెత్తే పద్ధతిలో కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరపాలని టీడీపీ మద్దతుదారులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 వైసీపీ, టీడీపీ మద్దతుదారులు పెద్దఎత్తున గుమికూడడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ దీనంబంధు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఎన్నికల అధికారిణి ఎం.ఆర్‌ ఆశాజ్యోతి, సిబ్బందితో కలిసి ఎన్నికలు నిర్వహించేందుకు వాడనర్సాపురం వచ్చారు. చేతులెత్తే విధానంలో ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధంకాగా, టీడీపీ మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రహస్య బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని తాము హైకోర్టును ఆశ్రయించామని, పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి.. ఎన్నికలను వాయిదా వేయాలని శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారని టీడీపీ నాయకులు సూరాడ అప్పలరాజు, చెల్లూరి దేముడు, కోడా శ్రీనివాసరావు, ఆనందరావు చెప్పారు. 

ఇక్కడ మొత్తం 454  మంది ఓటర్లు వున్నారని, 50 మందికి మించి ఓటర్లు వుంటే రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తమ తరపున వాదిస్తున్న లాయర్‌ కోర్టుకు విన్నవించడంతో న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారని టీడీపీ నాయకులు తెలిపారు. అయితే చాలా కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం చేతులెత్తే విధానంలో ఎన్నికలు జరపాలని వైసీపీ నాయకులు కొవిరి రామకృష్ణ, కారే రామారావు, చింతకాయల పెంటయ్య, ఎరిపల్లి గంటాలురావు, తదితరులు పట్టుబట్టారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని తమకు చూపించాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో  ఎన్నికల అధికారిణి ఆశాజ్యోతి... అమరావతిలో ప్రభుత్వ న్యాయవాదికి ఫోన్‌ చేసి, హైకోర్టు ఆదేశాల గురించి వాకబు చేశారు. దీంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

 అనంతరం వైసీపీ నాయకులు విలేఖరులతో మాట్లాడుతూ, ఎన్నికలను ఏ పద్ధతిలో, ఎప్పుడు నిర్వహించినప్పటికీ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు హైకోర్టులో కేసు వేశారని ఆరోపించారు. కోర్టు  ఆదేశాల మేరకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారిణి చెప్పారని, కోర్టు ఆర్డర్‌ కాపీని మాత్రం తమకు చూపించలేదన్నారు. 

తెలుగుదేశం పార్టీ నాయకులు విలేఖరులతో మాట్లాడుతూ, అధికార పార్టీ నాయకులు ఓటర్లను భయపెట్టి చేతిలెత్తే విధానం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నించడంతో తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఉత్వర్వులు జారీ చేసిందని, ఆ ప్రకారం పోలింగ్‌ జరపాలని జిల్లా అధికారులను కోరుతున్నట్టు తెలిపారు.


Updated Date - 2022-08-14T05:58:11+05:30 IST