ఉత్తరాంధ్రలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-01-21T09:17:11+05:30 IST

ఉత్తరాంధ్రలో ఉద్రిక్తత

ఉత్తరాంధ్రలో ఉద్రిక్తత

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు శ్రీకాకుళం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పడతామని ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ కొమ్ము అప్పలరాజు, కో-చైర్మన్లు పొందూరు అప్పారావు, ఎస్వీ రమణమూర్తి, మజ్జి మదన్‌మోహన్‌, టెంక చలపతిరావు, రాష్ట్ర బాధ్యుడు చౌదరి రవీంద్ర హెచ్చరించారు. జీవోలను రద్దు చేయాలని లేదా ప్రభుత్వం గద్దె దిగాలని నినాదాలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విజయనగరంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయినా వేలాది మంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు, ట్రెజరీ, ఆర్‌అండ్‌బీ తదితర ఉద్యోగులు ముట్టడికి సంఘీభావం తెలిపారు. వేలాది మంది నిరసన ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ట్రాఫిక్‌ గంట పాటు నిలిచిపోయింది. విశాఖ కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్లకుండా మండలాల్లో ఉపాధ్యాయ సంఘ నాయకులను పోలీసులు బుధవారం రాత్రి నుంచే హౌస్‌ అరెస్టు చేశారు.  కొందరిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయినా ఉపాధ్యాయులు కలెక్టర్‌ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆందోళన చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ ఎంవీ కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


గోదావరి జిల్లాల్లో నిరసన హోరు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్‌ ముట్టడికి అన్ని ప్రాంతాల నుంచి దాదాపు ఏడు వేల మంది ఉపాధ్యాయులు తరలివచ్చారు. కలెక్టరేట్‌ వద్ద ఉన్న బారికేడ్లను తోసుకుని కార్యాలయ ప్రవేశ ద్వారం వద్దకు దూసుకొచ్చారు. పోలీసులు వారిని నిలువరించడంతో రోడ్డుపైనే బైఠాయించారు. ప్లకార్డులను పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులు తదితరులు నాయకత్వం వహించారు. చీకటి జీవోలను రద్దు చేసి తెలంగాణతో సమానంగా 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, డిమాండ్లు నెరవేర్చకపోతే జగన్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరు వేల మందికి పైగా కాకినాడ కలెక్టరేట్‌ ముట్టడికి తరలివచ్చారు.  


తలకిందులుగా నిరసన 

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. సీఎం డౌన్‌, డౌన్‌.. చీకటి జీవోలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. గుంటూరులో కలెక్టరేట్‌ ముట్టడికి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు హాజరయ్యారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నుంచి జరిగే ఆందోళనలో పంచాయతీరాజ్‌ ఉద్యోగులు పాల్గొనాలని ఏపీ పీఆర్‌ మినీస్టీరియల్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పిలుపిచ్చారు. ఒంగోలు కలెక్టరేట్‌ను వేలాదిమంది ముట్టడించారు. నిరసనకారులను కొన్నిచోట్ల అరెస్టు చేయగా, మరికొన్నిచోట్ల ఒంగోలు వెళ్లరాదంటూ నోటీసులు ఇచ్చారు. వాహనాల్లో వస్తున్న వారిని మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు తలకిందులుగా నిలబడి నిరసన తెలిపారు. కొందరు గుంజీలు తీశారు. వేలాదిగా తరలిరావడంతో నెల్లూరు కలెక్టరేట్‌ సమీపంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. 

Updated Date - 2022-01-21T09:17:11+05:30 IST