తోట్లవల్లూరులో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-20T06:25:00+05:30 IST

తోట్లవల్లూరులో ఉద్రిక్తత

తోట్లవల్లూరులో ఉద్రిక్తత
చికెన్‌ షాపు తొలగిస్తున్న దృశ్యం

దళితవాడలో చికెన్‌ షాపు తొలగింపుపై టీడీపీ ఫైర్‌

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా


తోట్లవల్లూరు, మే 19 : తోట్లవల్లూరులో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పెనమకూరు వరకు ఉన్న ఆరు కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డులో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఇళ్ల తొలగింపు ప్రక్రియ గురువారం జరిగింది. ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇస్తామన్న హామీతో చాలామంది స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. ఐదుచోట్ల ఉన్న ఆక్రమణలు అలాగే ఉన్నాయి. దీంతో తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఉయ్యూరు పోలీస్‌స్టేషన్ల నుంచి 70 మంది పోలీసులు, సచివాలయాల మహిళా పోలీసులతో భారీ బందోబస్తు నడుమ గురువారం తొలగింపునకు వచ్చారు. కాగా, రాష్ట్ర ఉపాధి హామీ మండలి డైరెక్టర్‌ వీరంకి వెంకట గురుమూర్తి, తెలుగు రైతు మండల అధ్యక్షుడు నెక్కలపూడి మురళీ వచ్చి ప్రత్యామ్నాయంగా స్థలాలిచ్చి తొలగించాలని అధికారులను కోరారు. చివరికి స్థలాలిచ్చేందుకు తహసీల్దార్‌ కె.వెంకటశివయ్య హామీ ఇవ్వటంతో ఆక్రమణలను తొలగించారు. అనంతరం తోట్లవల్లూరు-ఉయ్యూరు రోడ్డులో దళితవాడ వద్ద ఉన్న టీడీపీ కార్యకర్త ఈడ్పుగంటి సుధాకర్‌ చికెన్‌ షాపును తొలగించారు. దీంతో గురుమూర్తి, మురళీ, పలువురు దళితులు తహసీల్దార్‌పై మండిపడ్డారు. టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా వచ్చి తొలగించిన చికెన్‌ షాపును పరిశీలించి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఆ తరువాత తహసీల్దార్‌తో చర్చలు జరిపారు. డ్రెయినేజీలపై కాకుండా ఎక్కడైనా స్థలం చూసుకుంటే చికెన్‌ షాపు నిర్మించుకునేందుకు సహాయం చేస్తామని తెలపటంతో ధర్నాను   విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మూడే శివశంకర్‌, టీడీపీ నేతలు చెన్నుపాటి శ్రీధర్‌, పాముల ప్రకాష్‌, వల్లూరు రత్నకోటయ్య, మాజీ వైస్‌ ఎంపీపీ వీరంకి వరహాలరావు తదితరులు పాల్గొన్నారు.                                




Updated Date - 2022-05-20T06:25:00+05:30 IST