వన్‌టౌన్‌లో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-09-20T09:30:55+05:30 IST

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దుర్గగుడిలో వెండి సింహాల చోరీపై బాధ్యత వహిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తన పదవికి

వన్‌టౌన్‌లో ఉద్రిక్తత

వన్‌టౌన్‌, సెప్టెంబరు 19 : రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దుర్గగుడిలో వెండి సింహాల చోరీపై బాధ్యత వహిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం కొత్తపేటలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు మహేష్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.

 

దుర్గగుడిలో వెండి సింహాల విగ్రహాలు చోరీ ఘటనలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు, పాలకమండలి, భక్తులను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి, ఈవో ఈ ఘటనపై స్పందించకపోతే శనివారం మంత్రి ఇంటి వద్ద ధర్నా చేపడతామని పోతిన మహేష్‌ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. శనివారం తెల్లవారుజామున కొత్తపేట సీఐ ఉమర్‌ ఆధ్వర్యంలో పోలీసులు పార్టీ కార్యాలయం, మహేష్‌ ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులు మహేష్‌ను బయటకు వెళ్లనీయకుండా హౌస్‌ అరెస్టు చేశారు.


అప్పటికే పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరగటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక పోలీసు దళం అక్కడకు చేరుకోవటంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. మహేష్‌ను, పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేయటానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


కార్యాలయం వద్ద ఉన్న మహేష్‌ను, నాయకులను పోలీసులు  వాహనాల్లో ఎక్కించి నున్న, సింగ్‌నగర్‌ పోలీసుస్టేషన్లకు తరలించారు. పోలీసుల చర్యలను ఖండిస్తూ జనసేన పార్టీ మహిళలు, కార్యకర్తలు కోమల విలాస్‌ సెంటర్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-20T09:30:55+05:30 IST