గరాలదిబ్బపై గరళం

ABN , First Publish Date - 2022-07-04T06:16:14+05:30 IST

గరాలదిబ్బపై గరళం

గరాలదిబ్బపై గరళం
గరాలదిబ్బ గ్రామంలో పోలీస్‌ బందోబస్తు

అందమైన పల్లెలో అధికార పార్టీ చిచ్చు

రెండు వర్గాల మధ్య ఘర్షణ

ఒక వర్గానికి కొమ్ముకాసిన వైసీపీ నాయకుడు

చెలరేగిపోయి ఇళ్లపై విధ్వంసం

తలుపులు, కిటికీలు, వస్తువులు ధ్వంసం

మహిళలను పరుగుపెట్టించి దాడులు

పోలీసుల భారీ బందోబస్తు


పచ్చటి గ్రామాన్ని రణరంగంగా మార్చేశారు. గరాలదిబ్బను ‘పగల’దిబ్బను చేశారు. ఆప్యాయతలకు మారుపేరుగా, ఆనందాలకు నెలవుగా ఉన్న గ్రామంలో సంగ్రామాన్ని సృష్టించారు. రెండు వర్గాల ఘర్షణకు రాజకీయ రంగును పులిమి అగ్గిని రాజేశారు. మంచి మనుషుల మధ్య చిచ్చు పెట్టారు. అధికార పార్టీ నాయకులు ఆడిన ఈ రాక్షస క్రీడలో బందరు మండలం గరాలదిబ్బ 20 రోజులుగా రగిలిపోతోంది. గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఓ వర్గం వారు కత్తులు పట్టుకు తిరుగుతున్నారు. మరో వర్గం వారి ఇళ్లను, వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. అడ్డొచ్చిన ఆడవారిని సైతం చితకబాదుతున్నారు. ఫలితంగా ప్రశాంతతకు మారుపేరైన చిన్న గ్రామం పగలూ ప్రతీకారాలతో అట్టుడికిపోతోంది. 

- ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం


నాడు.. పేరు గొప్ప

గరాలదిబ్బ గ్రామం సీ-బాస్‌గా పిలవబడే పండుగప్ప పిల్లల ఉత్పత్తి కేంద్రం. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇక్కడందరూ మత్స్యకారులే. రొయ్యల చెరువులు, సముద్రంలో చేపలవేట, పండుగప్ప చేపపిల్లలను పెంచి, విక్రయించి ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాలు. మచిలీపట్నం నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో టీచర్లు, పోలీస్‌ అధికారులు ఇంటికి ఒకరిద్దరు చొప్పున ఉంటారు. ఉద్యోగాల నిమిత్తం చాలామంది గ్రామాన్ని వీడిపోగా, మిగిలినవారు ఇక్కడే ఉంటున్నారు. చుట్టూ మడ అడవులు, సముద్రం నుంచి వచ్చీపోయే ఆటుపోట్లతో ఈ ప్రాంతం ప్రకృతి పరిచినట్టుగా ఉంటుంది. 

నేడు.. ఊరు ‘దిబ్బ’

ఇటీవల పదో తరగతి పూర్తిచేసిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ వేధించడంతో గరాలదిబ్బలో వివాదాలకుబీజం పడింది. బాలిక తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించడం, వారు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇవ్వడం జరిగాయి. అయినా సదరు ఆటోడ్రైవర్‌ బాలికను వేధిస్తుండటంతో గ్రామంలో ఒడుగు, బొడ్డు కుటుంబాల పేరున ఉన్నవారు రెండు వర్గాలుగా విడిపోయారు. 20 రోజుల క్రితం పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ కేసులో 15 మంది రిమాండ్‌లో ఉన్నారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒడుగు నాగరాజు అనే వ్యక్తి మరణించడంతో  వివాదం మరింత రాజుకుంది. దీంతో ఒడుగు వర్గీయులు.. బొడ్డు ఇంటి పేరు కలిగినవారిని, వారి బంధువులను టార్గెట్‌ చేశారు. వారి ఇళ్లపై దాడులకు దిగారు. దీంతో బొడ్డు ఇంటి పేరున్నవారు, వారి బంధువులు మచిలీపట్నం, పోలాటితిప్ప, గిలకలదిండి, బందరుకోట తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. గ్రామంలో పోలీస్‌ బందోబస్తు ఉన్నప్పటికీ వారు తిరిగి రావడానికి భయపడుతున్నారు.

అధికార పార్టీ అండతోనే..

బొడ్డు వర్గానికి చెందినవారి ఇళ్లపై దాడులు చేసి, టీవీలు ఫ్రిజ్‌లు, ఏసీలు పగలకొట్టి, నానా యాగీ చేయడానికి కారణం అధికార పార్టీ నాయకుల అండేనని తెలుస్తోంది. ఒడుగు వర్గీయులకు చెందిన మాజీ సర్పంచ్‌ అధికార పార్టీకి చెందిన మండలస్థాయి నాయకుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ తరహా గొడవలకు సూత్రధారిగా పేరొందిన సదరు నాయకుడి సూచనలతోనే ఈ దాడులు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. పిల్లలు, మహిళల వెంటపడి మరీ దాడులు చేసి ఇళ్ల నుంచి తరిమేశారని, బూతులతో దుర్భాషలాడారని బాధితులు పేర్కొంటున్నారు. కాగా, ఒడుగు నాగరాజు మృతదేహానికి ఆదివారం పోలీస్‌ బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. 







ముగ్గురు పిల్లలతో బురదలో పడి వచ్చా..

శనివారం సాయంత్రం 20 మందికిపైగా మా ఇంటి మీదకు కర్రలు, కత్తులు, రాళ్లతో దాడికి దిగారు. ముగ్గురు ఆడపిల్లలతో ప్రాణభయంతో పారిపోయి వచ్చాను. గ్రామం పక్కనే ఉన్న కాల్వలో బురదలో పడి పరిగెత్తాను. పిల్లలను రక్షించుకున్నాను. చెరువుల మీదుగా కోనరోడ్డుకు వెళ్లి, అక్కడి నుంచి పోలాటితిప్ప గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చి తలదాచుకున్నా. 

- బొడ్డు నాగలక్ష్మి


ఇంటి తలుపులు పగలకొట్టారు..

నేను ఇంట్లో ఉండగానే గుంపుగా వచ్చినవారు తలుపులు, కిటికీలు పగలకొట్టారు. ప్రాణభయంతో  దూరంగా వెళ్లిపోయాను. చెరువుల మీదుగా ఎంతో కష్టపడి పోలాటితిప్ప వచ్చాను. అయినా వెంటపడ్డారు. మా ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. వారి చేతికి చిక్కితే చంపేసేవారు. చెరువుల గట్లపై ఉన్న ఆయిల్‌ ఇంజన్లను నీటిలోకి తోసేశారు.

- బొడ్డు ఝాన్సీలక్ష్మి, గరాలదిబ్బ మాజీ సర్పంచ్‌


బండి లాక్కుని దాడి చేశారు

మా ఇంటి పేరున్న ఇళ్లపై ఒడుగు కుటుంబాల వారు దాడికి దిగారు. దీంతో మహిళలను అప్రమత్తం చేశాను. వేరే ప్రాంతానికి పంపేశాను. అనంతరం నా పల్సర్‌ బైకుపై వస్తుండగా, దారికాచి నాపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని చెరువుల మీదుగా కోనరోడ్డుకు చేరుకుని పోలాటితిప్ప గ్రామానికి వెళ్లాను. - బొడ్డు వెంకటేశ్వరరావు

Updated Date - 2022-07-04T06:16:14+05:30 IST