టెన్షన్‌ పడకండలా..!?

ABN , First Publish Date - 2022-05-17T04:00:10+05:30 IST

నేటి ఆధునిక సమాజంలో మనిషి అలవాట్లు, ఆహారపు పద్ధతుల వల్ల అనేక ప్రాణాంతక రోగాలు సంభవిస్తున్నాయి.

టెన్షన్‌ పడకండలా..!?

ఎక్కువయితే అధిక రక్తపోటే

బీపీని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయమే!

జిల్లాలో 4 లక్షల మందికిపైగా బాధితులు

నేడు ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం


ఉరుకులు పరుగుల జీవితం.. ఇంటా బయటా తట్టుకోలేనంత ఒత్తిడి... భవిషత్తుపై ఆందోళన.. వేళపాలాలేని తిండి.. జీవితంలో ఎక్కడ ఏ అంచనాలు తప్పినా ముంచుకొచ్చే కోపతాపాలు, నిరాశ నిస్పృహ.. ఫలితంగా నరాల్లో పోటేత్తే నెత్తుటి వేగం అదుపుతప్పి రేకెత్తించే అలజడి. వైద్య పరిభాషలో చెప్పాలంటే హైపర్‌ టెన్షన్‌ (అధిక రక్తపోటు). సాధారణ భాషలో దీనినే బీపీ అని కూడా అంటారు. ఆదిలోనే  దీనిని అదుపు చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. 


నెల్లూరు (వైద్యం), మే 16 : నేటి ఆధునిక సమాజంలో మనిషి అలవాట్లు, ఆహారపు పద్ధతుల వల్ల అనేక ప్రాణాంతక రోగాలు సంభవిస్తున్నాయి. మధుమేహం తర్వాత అంతటి ప్రమాదకరమైన రక్తపోటుకు అధిక శాతం మంది గురవుతున్నారు. ఈ వ్యాధి శరీమంతా వ్యాపించి ప్రధాన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లాలో 4 లక్షల మందికిపైగా రక్తపోటు వ్యాధిగ్రస్థులు ఉన్నట్లు  తెలుస్తోంది. గతంలో 45 ఏళ్ల పైబడిన వారికి వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు అన్ని వయస్కుల వారినీ కలవర పెడుతోంది. మధుమేహం ఉన్న వారికి ఈ రక్తపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. రక్తపోటుపై నిర్లక్ష్యం వహిస్తే అది గుండెపోటుకు కూడా దారి తీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వ్యాధి వల్ల మూత్ర పిండాలు, కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని ప్రధాన అవయవాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేస్తున్నారు. మంగళవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ  జీవితాంతం రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటూ ఈ ఏడాది నినాదాన్నిచ్చింది.


పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువ..

ప్రతి వంద మందిలో 15 మంది దాకా గ్రామాలలో వ్యాధిగ్రస్థులు ఉండగా పట్టణ ప్రాంతాలలో 20 మంది వరకు నమోదవుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో చాలామంది తీవ్రవ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతి ఒక్కరూ రక్తపోటు పరీక్షలు విధిగా చేయించుకుని తగిన వైద్యం చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ రక్తపోటు 120/80 ఉండాలి ఇది అధిగమిస్తే వ్యాధి లక్షణాలు గుర్తించాల్సి ఉంటుంది. వ్యాధిపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


రక్తపోటు పట్టిక

సాధారణం : 120/80

సీజ్‌ - 1 : 140/90

సీజ్‌ - 2 : 160/100

సీజ్‌ - 3 : 180/110 అంతకంటే ఎక్కువ


నివారణ ఇలా..

రోజువారి ఆహారంలో ఉప్పు 5గ్రాముల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.

ఆహారంలో కొవ్వు పదార్థాలు పరిమితి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అధిక బరువు ఉన్నట్టయితే బరువు తగ్గేందుకు తగిన జాగ్రత్తలు తప్పనిసరి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి.

మద్యం తాగే అలవాటు ఉంటే మోతాదు మించకుండా చూసుకోవాలి. పొగ తాగే అలవాటు ఉంటే పూర్తిగా మాని వేయాలి.

ఎప్పటికప్పడు రక్తపోటు పరీక్షించుకోవాలి. వైద్యుల సలహాలు తూ.చా తప్పకుండా పాటించాలి.


కిడ్నీలపై తీవ్ర ప్రభావం

అధిక రక్తపోటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధిపై నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ డయాలసి్‌సకు దారి తీస్తుంది. ఒక్కోసారి కిడ్నీ పనిచేయక మరణించే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా బీపీ ఉండి నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీలు దెబ్బతింటాయి. సడన్‌గా వచ్చే హై బీపీని మందులతో నయం చేసుకునే అవకాశం ఉంది. వైద్యులను సంప్రదించి వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవాలి.

-  డాక్టర్‌ చక్రవర్తి, కిడ్నీ వైద్య నిపుణులు, అపోలో ఆసుపత్రి, నెల్లూరు


మెదడులో రక్తనాళాలు చిట్లే అవకాశం 

మెదడుపై వ్యాధి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు వల్ల ఒక్కోసారి మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణంపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తం సరఫరా ఆగిపోయి కూడా బ్రెయిన్‌స్ర్టోకుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపఽథ్యంలో బీపీ, షుగర్‌ వ్యాధుల పట్ల ముందుగానే చికిత్స చేయించుకోవాలి. 

- డాక్టర్‌ సంపత్‌కుమార్‌, న్యూరోఫిజిషియన్‌, నారాయణ ఆసుపత్రి, నెల్లూరు


========

Updated Date - 2022-05-17T04:00:10+05:30 IST