పదివేలు దాటేశాయి

ABN , First Publish Date - 2022-01-20T07:24:02+05:30 IST

పదివేలు దాటేశాయి

పదివేలు దాటేశాయి

ఒక్కరోజే 10,057 కేసులు, 8 మరణాలు 

24.1 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు 

ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం,

డీఎంఈలో 20-30శాతం మందికి కొవిడ్‌ 

ఎంపీ మాధవి, ఎమ్మెల్యే గణబాబుకు కరోనా 

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌కు పాజిటివ్‌ 

90 శాతం ఒమైక్రాన్‌ కేసులే! 

టీకా వేయించుకున్న టెన్త్‌ విద్యార్థికి వైరస్‌ 


అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ఏకంగా 10 వేల మార్కును దాటేశాయి. పాజిటివిటీ రేటు 24.1 శాతానికి చేరిందని బుధవారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆరోగ్యశాఖ పేర్కొంది. సాధారణంగా కరోనా మహోధృతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్థాయిలో పాజిటివిటీ నమోదయింది. గతేడాది ఏప్రిల్‌ 23న అతఽ్యధికంగా 25.8శాతం రికార్డయింది. ఇప్పుడు మూడోదశ ప్రారంభంలోనే ఆ స్థాయిలో నమోదవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం, డీఎంఈలో 20నుంచి 30శాతం మంది సిబ్బందికి కొవిడ్‌ సోకినట్లు సమాచారం. చాలామంది హోం ఐసొలేషన్‌లో ఉంటూ ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇతర శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. వచ్చే 2వారాల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. 


యాక్టివ్‌ కేసులు 44,935 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గత 24గంటల్లో 41,713 మందికి పరీక్షలు నిర్వహించగా 10,057 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1,827 కేసులు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరులో 1,822, గుంటూరు 943, తూర్పుగోదావరి 919, అనంతపురం 861, ప్రకాశం 716, నెల్లూరు 698 చొప్పున కేసులు బయటపడ్డాయి. ఒకరోజు వ్యవధిలో విశాఖలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు 14,522కు పెరిగాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 44,935 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, విశాఖ జిల్లా అరకులోయ ఎంపీ జి.మాధవి కరోనా బారినపడ్డారు. మూడురోజుల క్రితం జ్వరం రావడంతో స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. ఎంపీకి మంగళవారం పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబుకు కరోనా సోకినట్టు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం వెల్లడించింది. 


ప్రకాశంలో 24మంది టీచర్లు, ఐదుగురు పిల్లలకు..

ప్రకాశం జిల్లాలో 24మంది టీచర్లు, ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క అమ్మనబ్రోలు హైస్కూల్‌లోనే ముగ్గురు విద్యార్థులకు వైరస్‌ సోకగా, వారిలో వ్యాక్సిన్‌ వేయించుకున్న పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నారు. కాగా, కర్నూలు జీజీహెచ్‌లోని ప్రసూతి విభాగంలో 16మంది బాలింతలు, ఇద్దరు గర్భిణులకు కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది. జీజీహెచ్‌లో ఇప్పటివరకు 30మంది వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు కొవిడ్‌ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. 


చంద్రబాబుకు చైనా రాయబారి లేఖ 

కొవిడ్‌ బారిన పడిన టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా కోలుకోవాలని భారత్‌లోని చైనా రాయబారి సున్‌ వీడాంగ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు చంద్రబాబుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. ‘కరోనా పరీక్షలో మీకు పాజిటివ్‌ వచ్చిందని బాధపడ్డాం. మీరు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యం పొందాలని కోరుకొంటున్నాను. మీ ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకోండి’ అని సూచించారు. 


కొవిడ్‌ బాధితుడి ఆత్మహత్య

కుప్పం, జనవరి 19: చిత్తూరు జిల్లాలో ఓ కొవిడ్‌ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు... కుప్పం మండలం లక్ష్మీపురం పంచాయతీ గెసికబావి ప్రాంతానికి చెందిన విజయ్‌ ఆచారి(29) కూలీగా పని చేసేవాడు. ఈ నెల 17న అతను మద్యం తాగి ఇంటికి వెళ్లగా భార్యతో మాటామాటా పెరిగింది. మనస్తాపం చెందిన విజయ్‌ పురుగుల మందు తాగడంతో పీఈఎస్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతున్న విజయ్‌కి బుధవారం పాజిటివ్‌గా తేలింది. అదేరోజు రాత్రి 11.15గంటలకు నాలుగో అంతస్థులోని వార్డు నుంచి కిటికీ అద్దాలు పగులగొట్టుకుని విజయ్‌ కిందికి దూకేశాడు. తల నేలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు(3, 5 ఏళ్లు) ఉన్నారు. గుడుపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


ఆర్టీపీసీఆర్‌ టెస్టు రూ.350 

ఆర్టీపీసీఆర్‌ పరీక్షల రేటును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నెల 4న నిర్వహించిన ఆరోగ్యశ్రీ టెక్నికల్‌ కమిటీ సమావేశంలో ఆర్టీపీసీఆర్‌ ధరలపై అధికారులు చర్చించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌ కిట్స్‌ తయారు చేసే కంపెనీలు పెరగడంతో కిట్‌ల ధర చాలావరకూ తగ్గింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌ ధరను రూ.350కు కుదించాల్సిందిగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ పరీక్షల ధరలను జిల్లాల్లో వైద్యాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-20T07:24:02+05:30 IST