Abn logo
Sep 17 2021 @ 01:18AM

టెండర్‌..!

వైఎ్‌సఆర్‌ పోషణ కిట్ల సరఫరా టెండర్లలో కాంట్రాక్టర్లు కుమ్మక్కు?

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 16: జిల్లాలో అంగన్‌వాడీలకు వైఎ్‌సఆర్‌ పోషణ కిట్ల సరఫరా టెండర్‌ అప్పగింతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది పారదర్శక టెండర్‌ కాదనీ, పంపకాల టెండర్‌ అంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు నిర్వహించారు.. ఓ సంస్థ తక్కువకు కోట్‌ చేసి, దక్కించుకుంది.. అంతా బాగానే ఉంది. పోషణ కిట్ల సరఫరా బాధ్యతలను మాత్రం టెండర్‌ దక్కించుకున్న సంస్థతోపాటు మరో మూడు కంపెనీలకు అప్పగించారు. ఇదేంటని అధికారులను అడిగితే.. ఒక్కరే సరఫరా చేయలేమన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. సరఫరా చేతకాకనే ఆ సంస్థ పోటీపడి టెండర్‌ దక్కించుకుందా? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. కాం ట్రాక్టు సంస్థలు రింగ్‌ అయి, ఇలా చేశాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాత్రం దానికి.. టెండర్లు అవసరమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుయాయులకు పంచేస్తే పోలా.. అని జిల్లావాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. వైసీపీ అధికారం చేపట్టాక వైఎ్‌సఆర్‌ పోషణ కిట్ల రూపంలో వీటిని కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఏడాదికోసారి సరఫరా టెండర్లు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 5126 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు 4 లక్షల మందికి ఈ పౌష్టికాహారం అందజేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వ చ్చాక నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ రాష్ట్ర నేతల ఒత్తిడితో సరఫరా బాధ్యతలు అప్పగించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఆ కాంట్రక్టర్‌ రెండేళ్లుగా సక్రమంగా సరఫరా చేయలేదనీ, అయి నా అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు కొత్త గా జిల్లా యంత్రాంగం టెండర్లు ఆహ్వానించింది. ఆన్‌లైన్‌ టెండర్‌తో పారదర్శకంగా కాంట్రాక్టర్‌ ఎంపి క ఉంటుందని చెబుతూ వచ్చారు. పదిమంది పోటీ పడగా.. అందులో నలుగురు అనర్హులని తొలగించారు. మిగిలిన ఆరుగురు బరిలో నిలబడగా.. ఆన్‌లైన్‌లో రీ టెండర్‌ పిలిచారు. విశాఖపట్నంకు చెంది న విక్టరీ బజార్‌ సంస్థ అందరికన్నా.. తక్కువ మొ త్తం రూ.222కి కోట్‌ చేసి, టెండర్‌ దక్కించుకున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ సుజన తెలిపారు. అంతేకాకుండా పారదర్శకంగా టెండర్‌ నిర్వహించడంతో గతేడాది రూ.241 కన్నా ఈసారి రూ.222కే టెండర్‌ ఇచ్చామన్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ2.50 కోట్ల వరకు  మిగిలిందని పీడీ ప్రకటించారు. అందరూ ఆహా అని అనుకున్నారు. ఈ తంతు ముగిసి వారం గడవకనే పంపిణీ బాధ్యతలు పంచిపెట్టారు. టెండర్‌ విక్టరీ బజార్‌ సంస్థ దక్కించుకోగా.. ఇప్పుడు మరో ముగ్గు రు కాంట్రాక్టర్లకు అదే రేటుతో సరఫరా చేయడానికి అది కూడా అధికారులే ఆమోదం తెలిపి, ఉత్తర్వులు జారీ చేశారు. పూరీ జగన్నాథ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కేంద్రీ య బాండార్‌, సూర్యకుమారి సంస్థలకు కూడా అప్పగించారు. మొత్తం నాలుగు సంస్థలకు నియోజకవర్గాల పరిధిలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలను కేటాయించి, సరఫరా చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు, చర్చ సాగుతోంది. టెండర్‌దారుడు సరఫరా చేయగలిగే శక్తి ఉన్నపుడే పోటీపడి దక్కించుకుంటారు. ఇక్కడ టెం డర్‌ దక్కిన తర్వాత జిల్లా అంతా సరఫరా చేయలేనని మిగిలిన వారికి అవకాశం కల్పించాలని టెండర్‌ దక్కించుకున్న వ్యక్తే అధికారులకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముందుగానే ఈ సంస్థలు రింగ్‌ అయి, ఎవరికి వచ్చినా అందరూ చేసుకుందామని మాట్లాడుకుని ఇలా చేశాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లు సక్రమంగా సమయానికి కోడిగుడ్లు, పాలు, పౌష్టికాహారం సరఫరా చేయడం లేదనీ, నాణ్యతకు కూడా తిలోదకాలిస్తున్నారనీ, వీరికి అధికారులు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ముందునుంచీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరికి టెండర్‌ దక్కగా.. మరో ముగ్గురికి పంచిపెట్టడం చర్చనీయాంశమైంది.

చేతకాదన్నందుకే మరో ముగ్గురికి అప్పగింత


జిల్లావ్యాప్తంగా వైఎ్‌సఆర్‌ పోషణ కిట్లు సరఫరా చేయడం చేతకాదని టెండర్‌ దక్కించుకున్న విక్టరీ బజార్‌ సంస్థ రాతపూర్వకంగా తెలిపింది. ఈ విషయంపై జిల్లా అధికారులు సీరియ్‌సగా స్పందించి, చర్చించారు. అప్పటికీ ఆ సంస్థ ఒకరికే కష్టమని చెప్పడంతో మరో ముగ్గురికి పంపిణీ బాధ్యతలు అప్పగించింది. ఇందులో ఎలాంటి అపోహాలు, అనుమానాలకు తావు లేదు.

- సుజన, పీడీ, ఐసీడీఎస్‌