టెం‘ఢర్‌’!

ABN , First Publish Date - 2021-10-21T06:55:18+05:30 IST

నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన కారల్‌మార్క్స్‌ రోడ్డు అభివృద్ధికి ఆర్‌అండ్‌బీ పిలిచిన టెండర్లకు స్పందన కనిపించడంలేదు.

టెం‘ఢర్‌’!

కారల్‌మార్క్స్‌ రోడ్డు పనులకు రూ.కోటిన్నరతో టెండర్‌ 

ముందుకు రాని కాంట్రాక్టు సంస్థలు

ఎన్‌డీపీ రోడ్డు పనుల్లోనూ స్తబ్దత 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన కారల్‌మార్క్స్‌ రోడ్డు అభివృద్ధికి ఆర్‌అండ్‌బీ పిలిచిన టెండర్లకు స్పందన కనిపించడంలేదు. ఎవరూ టెండర్‌ వేయకపోవటంతో ఈ రోడ్డు అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. జిల్లావ్యాప్తంగా ఎన్‌డీబీ కింద చేపట్టవలసిన ఆర్‌ఆండ్‌బీ రోడ్ల అభివృద్ధి పనులకే కాదు.. ప్యాచ్‌వర్క్‌లు చేసేందుకు సైతం కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. వర్షాకాలం అయిపోయిన తర్వాత రోడ్ల పనులు జరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 


కారల్‌మార్క్స్‌ రోడ్డుకు సింగిల్‌ టెండర్‌ లేదు  

నగరంలో అత్యంత ప్రధానమైన రహదారుల్లో ఒకటైన కారల్‌మార్క్స్‌ రోడ్డుకు ఆర్‌అండ్‌బీ కొద్ది కాలం క్రితం రూ.1.50 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. సింగిల్‌ టెండర్‌ కూడా పడలేదు. ఈ రోడ్డుకు ముందుగా ప్యాచ్‌వర్క్‌లు చేసి, దానిపై బీటీ వేసేలా టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవటంతో వీఎంసీనే ప్యాచ్‌వర్క్‌లను చేపట్టింది. మళ్లీ టెండర్లు పిలిచేందుకు ఆర్‌అండ్‌ బీ రంగం సిద్ధం చేస్తోంది. వాటికైనా స్పందన వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. 


ఎక్కడ వేసిన గొంగళి అక్కడే  

జిల్లావ్యాప్తంగా ఎన్‌డీబీ రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. జిల్లాలో ఎన్‌డీబీ ఆర్థిక భాగస్వామ్యంతో చేపట్టే 13 రోడ్లు ఎంతో ముఖ్యమైనవి. పెద్ద కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న ఉద్దేశంతో అన్ని రోడ్లకూ ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలిచారు. వృద్ధి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ కాంట్రాక్టులను దక్కించుకుంది. అయితే ఎక్కడికక్కడ పనులను సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చేసింది. సబ్‌ కాంట్రాక్టు పొందినవారు ఈ పనులను చేపట్టడానికి ఆసక్తి చూపటం లేదు. నిడమర్రు రోడ్డు, మచిలీపట్నం కమ్మవారి రోడ్డు, నూజివీడు - ఏలూరు రోడ్డు, గన్నవరం - పుట్టగుంట రోడ్లలో మాత్రమే పిచ్చి మొక్కల తొలగింపు, సర్వే, అలైన్‌మెంట్‌ పనులు జరిగాయి. గన్నవరం - నూజివీడు రోడ్డుకు సర్వే, అలైన్‌మెంట్‌ పనులు జరిగిన తర్వాత ఆగిపోయాయి. మిగిలిన ఎనిమిది రోడ్ల పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే ప్రశ్నకు సమాధానమే దొరకడం లేదు. 

Updated Date - 2021-10-21T06:55:18+05:30 IST