అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-22T05:59:14+05:30 IST

అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతుపురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

జగదేవ్‌పూర్‌, మే 21: అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతుపురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జగదేవ్‌పూర్‌ మండలంలోని రామవరంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రాయవరానికి చెందిన కౌలు రైతు దబ్బెట మల్లేశం(56) ఒక ఎకరం భూమిని కౌలుకు తీసుకొని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నాడు. ఈసారి పంట వేయగా పెట్టుబడి కూడా రాక అప్పుల పాలయ్యాడు. దీనికి తోడు మల్లేశం పెద్ద కుమారుడు భాస్కర్‌ అనారోగ్యానికి గురి కావడంతో వైద్యానికి అయిన ఖర్చులతో కలిసి సుమారు రూ.4లక్షలకు పైనే అప్పులు అయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురైన మల్లేశం  శనివారం ఉదయం  పురుగుల మందు తాగాడు. మల్లేశం నోట్లో నుంచి నురగలు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లేశం రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జగదేవ్‌పూర్‌ ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. 

Updated Date - 2022-05-22T05:59:14+05:30 IST