రోడ్డెక్కితే.. బోల్తానే

ABN , First Publish Date - 2022-07-26T05:30:00+05:30 IST

ఒక కిలోమీటరు రోడ్డు.. కుంగిపోయి, గోతులతో నిండి ఉంది. వందలాది ప్రమాదాలకు నెలవుగా ఉంది. గత పది రోజుల్లో నాలుగు లోడు లారీలను బోల్తా కొట్టించింది.

రోడ్డెక్కితే.. బోల్తానే
పెదపూడి దగ్గర మూడు నుంచి నాలుగడుగుల లోతుకు కుంగిపోయిన ఆర్‌.అండ్‌.బీ రహదారి

కుంగిపోయి, గుంతలతో నిత్యం ప్రమాదాలు

అత్యంత ప్రమాదకరంగా తెనాలి-చందోలు రోడ్డు

రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపినా ఎదురుచూపులే


తెనాలి,  జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఒక కిలోమీటరు రోడ్డు.. కుంగిపోయి, గోతులతో నిండి ఉంది. వందలాది ప్రమాదాలకు నెలవుగా ఉంది. గత పది రోజుల్లో నాలుగు లోడు లారీలను బోల్తా కొట్టించింది. మూడేళ్ల నుంచి పదికిపైగా ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు చేయించింది. 40  కిలోమీటర్ల రోడ్డుపై ఎవరినీ తిరగనివ్వకుండా నిర్మానుష్యం చేసింది.   ఇంత దారుణమైన రోడ్డు ఎక్కడో కీకారణ్యాల మధ్యనో, ఎవరికీ పట్టని ఏజెన్నీ ప్రాంతంలోనో అనుకుంటే పొరపాటే. సాక్షాత్తు రాష్ట్ర రాజధానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 216 జాతీయ రహదారికి రాజధాని ప్రాంతాలను చేరువచేసే ప్రధాన రహదారి. గుంటూరు జిల్లా తెనాలి - బాపట్ల జిల్లా చందోలు మధ్య ఉన్న రహదారిపై అమృతలూరు మండలం పెదపూడి దగ్గర ఒక కిలోమీటరు వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిని పోయింది. రోడ్డు మధ్యకు బద్దలుగా పగిలిపోయింది. నాలుగడుగులు కుంగిపోయింది. ఎవరైనా సాహసించి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తే అంతే సంగతులు. ఇరువైపులా ఉన్న కాలువల్లోకి జారిపోవలసిందే. ఈ మార్గంలో ప్రయాణించే వాహన చోదకులు పడిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇంత ప్రమాదకరంగా ఉన్న ఆర్‌అండ్‌బీ అధికారులు కాని, ప్రజాప్రతినిధులు కాని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. తెనాలి-చందోలు మధ్య దెబ్బతిన్న రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల క్రితం సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ రూ.8 కోట్లు మంజూరు చేసింది. పనులకు సంబంధించి టెండరు ఒప్పందాలు జరిగినా గతంలో చేసిన పనుల తాలూకు డబ్బు ప్రభుత్వం నుంచి అందలేదనే కారణంతో ఈ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. అయితే ఈ నిధుల్లో కుంగిన కిలోమీటరు రోడ్డు లేకపోవడంతో మరమ్మతులకు వేరుగా రూ. కోటిన్నరతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం నుంచి చలనం లేదు. జాతీయ రహదారిని అనుసంధానం చేసే దగ్గర మార్గమైనా తెనాలి-చందోలు రోడ్డుపై రవాణాకు ఎవరూ సాహసించడంలేదు. ఈ మార్గంలోని గ్రామాలకు తెనాలి, రేపల్లె, పొన్నూరు డిపోల నుంచి ఉన్న 12కు పైగా బస్‌ సర్వీసులను రద్దు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  


Updated Date - 2022-07-26T05:30:00+05:30 IST