ఖజానాకు చేరని.. కాసులు!

ABN , First Publish Date - 2021-02-19T06:21:38+05:30 IST

ప్రజలకు సేవలు సరళతరం చేసేందుకు గ్రామ/వార్డు సచివాలయాలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఖజానాకు చేరని..  కాసులు!

సచివాలయాల్లో సేవలకు ఫీజులు

భుత్వ ఖజానాకు చేరని నగదు

అజమాయిషీ లేక ఎవరకి వారే ఇష్టానుసారం..

జిల్లాలో సుమారు రూ.3.36 కోట్ల ప్రజాధనం సిబ్బంది దగ్గరే

ఖర్చు చేసేశారో! ఉన్నాయో తెలియని సందిగ్దం

 

గ్రామ/వార్డు సచివాలయాల్లో అజమాయిషీ లోపంతో రూ.కోట్ల ప్రజాధనం ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదు. దరఖాస్తులు, సేవలకు గాను వసూలు చేసే రుసుము సిబ్బంది జేబుల్లోనే మూలుగుతోంది. అడిగేవారు లేకపోవడంతో ఈ ఆదాయంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలోని 1,334 సచివాలయాల్లో ఈ తరహా నగదు   మొత్తం సుమారు రూ.3.36 కోట్ల వరకు నగదు ఉండవచ్చనేది అంచనా.

 

తెనాలి, ఫిబ్రవరి 18, (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవలు సరళతరం చేసేందుకు గ్రామ/వార్డు సచివాలయాలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. వాటి ద్వారా ఆదాయం రాకపోగా అజమాయిషీ లోపంతో రూ.కోట్ల ప్రజాధనం ప్రభుత్వ ఖజానాకు జమ కావడం లేదు. అదంతా సిబ్బంది జేబుల్లోనే మూలుగుతోంది. జిల్లాలో మొత్తం 1,334 సచివాలయాలున్నాయి. వీటిలో గ్రామ సచివాలయాలు 872, వార్డు సచివాలయాలు 462 ఉన్నాయి. వీటిలో అన్ని శాఖలకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయి. సచివాలయాల్లో అన్నిరకాల సేవలు ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేశారు. వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు, భూముల సర్వే, ఇతర అంశాలకు సంబంధించిన వాటికోసం లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేస్తారు. ఇది చిల్లర జమల కిందికి వస్తుంది. అయితే ఈ మొత్తాలను ఏ రోజుకారోజు పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ప్రభుత్వ ఖాతాలో జమ చెయ్యాలి. ఆ రోజు సాధ్యం కాకున్నా, కనీసం రెండో రోజైనా ప్రభుత్వ ఖాతాలో వెయ్యాల్సిందే. అంతకు మించి ఆ సొమ్ము సిబ్బంది దగ్గర ఉంటే అది నేరమే అవుతుంది. 


ఎవరు అడిగారులే అని..

అయితే చిల్లర ఖర్చులు అనుకున్నారో! లేక జమ చేయకుంటే ఎవరు అడిగారులే అనుకున్నారో కానీ, ఆ చిల్లర ఆదాయంపై నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ఉన్నతాధికారులు చెబుతున్న మాటే. సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌లు, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలు, పంచాయతీల కార్యదర్శులు, వార్డుల అడ్మిన్‌ సెక్రటరీలు దీనికి బాధ్యత తీసుకుంటారు. అయితే వీరిలో ఒక్కరు కూడా ఈ మొత్తాలను జమ చేయించే విషయంలో శ్రద్ధ చూపకపోవటం విశేషం. కొన్ని సచివాలయాల్లో నెలకు పైనే వసూళ్ల నిల్వ ఉంటే, మరికొన్ని సచివాలయాల్లో రోజుల వ్యవధి ఉందని చెబుతున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం రూ.20వేలపైనే చిల్లర జమలు సిబ్బంది చేతిలోనే ఉంటే, వార్డు సచివాలయాల్లో అయితే కనీసం రూ.35వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుందనేది సమాచారం. అంటే మొత్తం 1,334 సచివాలయాల్లో సుమారు రూ.3.36 కోట్ల వరకు నగదు ఉండవచ్చనేది అంచనా. చాలావరకు సిబ్బంది చేతివాటంతో లెక్కలు కూడా నిర్వహించకపోవటం, వీటిపై తనిఖీలు, నగదు రిజిస్టర్ల వంటివి చాలా సచివాలయాల్లో పక్కాగా లేవనేది సమాచారం. దీంతో కొందరైతే సొంత ఖర్చులకు కూడా వాటిని వాడేసుకున్నారనేది తోటి సిబ్బంది చెబుతున్న మాటే. ఇదే విషయం జిల్లా జేసీ దృష్టికి కూడా వెళ్లినట్టు సమాచారం. ఈ తరహా చిల్లర ఖర్చుల విషయంలో కచ్చితంగా లేకుంటే చర్యలు తప్పవని తాజాగా ఆమె హెచ్చరించారని తెలిసింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ చిల్లర జమలే కదా అని వదిలేయకుండా దృష్టి పెడితే రూ.కోట్ల విలువైన ప్రజాధనం ప్రభుత్వ ఖాతాల్లోకి చేరుతుంది.

Updated Date - 2021-02-19T06:21:38+05:30 IST