ఈ శిలాఫలకానికి దశాబ్దం.. నాటి సీఎం కిరణ్ రెడ్డి శంకుస్థాపన.. నేటికీ ప్రారంభం కాని పనులు!

ABN , First Publish Date - 2022-03-21T21:04:53+05:30 IST

ఈ శిలాఫలకానికి దశాబ్దం.. నాటి సీఎం కిరణ్ రెడ్డి శంకుస్థాపన.. నేటికీ ప్రారంభం కాని పనులు!

ఈ శిలాఫలకానికి దశాబ్దం.. నాటి సీఎం కిరణ్ రెడ్డి శంకుస్థాపన.. నేటికీ ప్రారంభం కాని పనులు!

  • అటకెక్కిన గోల్నాక కనెక్టివ్‌ బ్రిడ్జి నిర్మాణం
  • ట్రాఫిక్‌ సమస్యలతో నిత్యం నరకం

గోల్నాక చౌరస్తాలో ట్రాఫిక్‌ సమస్య నివారించడానికి గోల్నాక కొత్త బ్రిడ్జి నుంచి కృష్ణానగర్‌ వరకు నిర్మించతలపెట్టిన కనెక్టివ్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి దశాబ్దం గడిచిపోయింది. అధికారుల అలసత్వమో.. పాలకుల నిర్లక్ష్యమో తెలియదు కానీ.. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అక్కడ శిలాఫలకం అలంకారప్రాయంగా కనిపిస్తోంది తప్ప ప్రయోజనం లేకుండా పోయింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. గోల్నాక చౌరస్తాలో నిత్య ట్రాఫిక్‌ సమస్య నుంచి విముక్తి లభిస్తుందని ప్రజలు ఎంతగానో ఆశించారు. కానీ.. వారి ఆశలు నిరాశగా మిగిలాయి. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 


హైదరాబాద్ సిటీ/గోల్నాక : గోల్నాక చౌరస్తాలో నిరంతర ట్రాఫిక్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో గోల్నాక కొత్త బ్రిడ్జి నుంచి కృష్ణానగర్‌ వరకు కనెక్టివ్‌ బ్రిడ్జిని నిర్మాంచాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అందుకు రూ.5 కోట్ల 75 లక్షల నిధులు కూడా మంజూరు చేసింది. ఈ మేరకు 2011 ఆగస్టు 21న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డితో శుంఖుస్థాపన చేయించింది. దీంతో బ్రిడ్జి నిర్మాణ పనులు తొందరగా పూర్తయి తమ సమస్యలు తీరుతాయని స్థానికులు సంతోషపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పదేళ్లు పూర్తవుతున్నా ఆ సమస్య ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. కృస్ణానగర్‌లో పలువురి పేదల ఇళ్లను తొలగించాల్సి ఉండడంతో స్థానికంగా వారు వ్యతరేకిస్తున్నారు. దీంతో సమస్య మొదలైంది. జీహెచ్‌ఎంసీ అధికారులు స్థానికులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి పనులను ప్రారంభించడానికి చొరవతీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. గోల్నాక కొత్త బ్రిడ్జి నుంచి కృష్ణానగర్‌ వరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, అంబర్‌పేట అలీకేఫ్‌ చౌరస్తా నుంచి చాదర్‌ఘాట్‌, కోఠి వెళ్లే వాహనాలకు మార్గం సుగమనం కావడంతోపాటు గోల్నాక చౌరస్తాలో ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది. ఇప్పటికైనా ఈ బ్రిడ్జి నిర్మాణంతో కృష్ణానగర్‌లో ఇళ్లు కోల్పోతున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించి పనులను ప్రారంభించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


స్థానికులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా..

గోల్నాక కొత్త డ్రిడ్జి నుంచి కృష్ణానగర్‌ వరకు నిర్మించ తలపెట్టిన కనెక్టివ్‌ బ్రిడ్జి నిర్మాణం విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కృష్ణానగర్‌లో కొంతమంది పేదల ఇళ్లు తొలగించాల్సి వస్తోంది. ఈ విషయంలో పేదలతో మాట్లాడి వారిని ఒప్పించేందుకు కృషి చేస్తున్నా. అధికారులతో కూడా మాట్లాడుతున్నా. పేదలకు న్యాయం చేసి బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నా. - కాలేరు వెంకటేష్‌, అంబర్‌పేట ఎమ్మెల్యే 



ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మించాలి.. 

పేద ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే.. అంబర్‌పేట విద్యుత్‌ దహన వాటిక నుంచి ఈ బ్రిడ్జిని నిర్మించాలి. గోల్నాక కొత్త బ్రిడ్జి నుంచి కృష్ణానగర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఈ బ్రిడ్జి నిర్మిస్తే.. చాలా మంది పేదలు ఇళ్లను కోల్పోతారు. అధికారులు ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు. సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది.  - ఎం.మహేందర్‌, కృష్ణానగర్‌


బ్రిడ్జి నిర్మాణం చాలా అవసరం..

గోల్నాక చౌరస్తాలో నిత్యం ట్రాఫిక్‌ సమస్య నుంచి విముక్తి కల్పించడానికి గోల్నాక కొత్త బ్రిడ్జి నుంచి కృష్ణానగర్‌ వరకు కనెక్టివ్‌ బ్రిడ్జి నిర్మాణం ఎంతో అవసరం. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలి. శంకుస్థాపన చేసి వదిలేయడం సరికాదు. ఇప్పటికైనా అధికారులు తగిన నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి. 

- భూపతి లక్ష్మణ్‌, గోల్నాక

Updated Date - 2022-03-21T21:04:53+05:30 IST