పల్లెల్లో క్రీడా ప్రాంగణాలు

ABN , First Publish Date - 2022-05-22T05:39:26+05:30 IST

పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటుచేసింది. ప్రకృతి వనాలతో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రాగా, యువకులు క్రీడల్లో రాణించేలా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుచేసేందుకు నిర్ణయించింది.

పల్లెల్లో క్రీడా ప్రాంగణాలు

20 గుంటల నుంచి ఎకరం విస్తీర్ణంలో

స్థలాల ఎంపికకు కలెక్టర్ల ఆదేశాలు

ప్రభుత్వ భూములకోసం రెవెన్యూ అధికారుల వెతుకులాట


సూర్యాపేట సిటీ, మే 21: పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటుచేసింది. ప్రకృతి వనాలతో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రాగా, యువకులు క్రీడల్లో రాణించేలా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుచేసేందుకు నిర్ణయించింది. ప్రతీ పంచాయతీలో ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా 20 గుంటల నుంచి ఎకరం ప్రభుత్వ స్థలాన్ని సేకరించాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సమావేశాన్ని సైతం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల గుర్తింపు పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 844, సూర్యాపేట జిల్లా లో 475, యాదాద్రి భువనగిరి జిల్లాలో 421 పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ఎకరం స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఆ మొత్తం ప్రభుత్వం స్థలం దొరకని పక్షం లో 20గుంటలైనా గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. తొలుత ప్రతీ గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి, అందులో స్టేడి యం నిర్మాణానికి అనువువైనదాన్ని ఎంపిక చే యాల్సి ఉంటుంది. గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

స్థలాల కోసం రెవెన్యూ అధికారుల కసరత్తు

ఉమ్మడి జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం పంచాయతీల్లో ప్రభుత్వ స్థలాల గుర్తింపులో నిమగ్నమైంది. తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ప్రభుత్వ స్థలాలను గుర్తించే బాధ్యతను ఆయా గ్రామాల వీఆర్‌ఏలకు అప్పగించారు. కొన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ప్రభుత్వ భూములకు సంబంధించిన దస్త్రాలు లభించక, సర్వే నంబర్ల గుర్తింపు తలనొప్పిగా మారింది. ధరణి వైబ్‌సెట్‌లో ప్రభుత్వ భూముల వివరాలు చూపుతున్నా, క్షేత్రస్థాయిలో కొన్ని రైతుల కబ్జాలో ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని అయోమయంలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. అంతేగాక పంచాయతీల్లో ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు నిర్మించారు. వీటికి స్థలాల గుర్తింపులోనే రెవెన్యూ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల గ్రామానికి దూరంగా, మరికొన్ని చోట్ల గుట్టలు, బండరాళ్లతో ఉన్న స్థలాలను ఎంపిక చేసి రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికావడం, కొంతమంది రెవెన్యూ అధికారులు గతంలో పట్టాలు జారీచేయడం వంటి కారణాలతో పంచాయతీల్లో ప్రభుత్వ భూమి దొరకడం ఇబ్బందిగా మారింది. ఉన్న కొంత భూమిలో ఇప్పటికే పల్లెపకృతి వనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలు నిర్మించగా, కొత్తగా అదీ కూడా క్రీడా మైదానానికి అనువైన గ్రామం సమీపంలో ప్రభుత్వ భూమిని గుర్తించడం రెవెన్యూ అధికారులకు కత్తిమీదసాములా మారింది. 20గుంటలకు తక్కువ కాకుండా ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేయాలనే నిబంధన విధించడంతో మల్లగుల్లాలు పడుతున్నారు.


నెలాఖరు నాటికి స్థలాల ఎంపిక పూర్తి : టి.వినయ్‌కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌

గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణాల కు సంబంధించి ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించాం. ఈ నెల చివరి నాటికి స్థలాల ఎంపికి పూర్తవుతుంది. త్వరలో వాటి వివరాలను బహిరంగం గా వెల్లడిస్తాం. గ్రామానికి సమీపంలో, అనువైన ప్రభుత్వ భూములను గుర్తించి క్రీడా మైదానాల కోసం ఎంపిక చేస్తాం.


ఉమ్మడి జిల్లాలో పంచాయతీలు

నల్లగొండ : 844

సూర్యాపేట : 475

యాదాద్రి : 421

Updated Date - 2022-05-22T05:39:26+05:30 IST