నేటి నుంచి పది పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-23T03:57:14+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వల్ల గత రెండేళ్లు పరీక్షలు పెట్టకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులు చేశారు. దీంతో రెండు సంవత్సరాల తర్వాత తొలిసారిగా పరీక్షలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం(23-05-2022) నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు జూన్‌ 1న ముగుస్తాయి. ఉదయం తొమ్మిదన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి.

నేటి నుంచి పది పరీక్షలు
దహెగాంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎంఈవో వెంకటేశ్వరస్వామి

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

జిల్లాలో 39 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

ఉదయం తొమ్మిదన్నర గంటలకే ప్రారంభం

ఆసిఫాబాద్‌ రూరల్‌/కాగజ్‌నరగ్‌ టౌన్‌/తిర్యాణి/దహెగాం/రెబ్బెన/బెజ్జూరు/కెరమెరి/చింతలమానేపల్లి, మే 22:  కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  కరోనా వల్ల గత రెండేళ్లు పరీక్షలు పెట్టకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులు చేశారు. దీంతో రెండు సంవత్సరాల తర్వాత తొలిసారిగా పరీక్షలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం(23-05-2022) నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు జూన్‌ 1న ముగుస్తాయి. ఉదయం తొమ్మిదన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 167 ఉన్నత పాఠశాలలకు గాను 7,453 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందు కోసం జిల్లాలో 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందే ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ అధికారులను నియమించారు. 441 మంది ఇన్విజిలేటర్లతో పాటు 81 కస్టోడియన్లను నియమించారు. ఆయా పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల సిబ్బందితో పాటు విద్యార్థులు సెల్‌ఫోన్లు తీసుకు రావద్దని పేర్కొన్నారు.  

ఈ సారి ఆరు పేపర్లే..

కరోనా మహమ్మారి కారణంగా తరగతులు సక్రమంగా జరగకపోవడంతో పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చేశారు. పరీక్షల సిలబ్‌సను 70 శాతానికి కుదించారు. గతంలో ప్రతీ విద్యార్థి 11 పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఈసారి పేపర్ల సంఖ్యను ఆరుకు తగ్గించారు. కాగా, పరీక్షకు హాజరయ్యే విద్యార్థి తన హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.   కాగజ్‌నగర్‌లో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు.   ఆయా పాఠశాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని కాగజ్‌నగర్‌ ఎంఈవో భిక్షపతి తెలిపారు. కాగా పలు పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తిర్యాణి మండలంలో పదో  తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో వెంకటేశ్వరస్వామి తెలిపారు. జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలతో పాటు ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట చీఫ్‌ సూపరింటెండెంట్‌ రాము, శేఖు తదితరులు ఉన్నారు.  దహెగాం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో భిక్షపతి తెలిపారు. ఆదివారం ఆయన సీఎస్‌లు నరేందర్‌, యాదగిరి, డీవోలు భానుప్రకాష్‌, అబ్దుల్‌ రహూఫ్‌తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. రెబ్బెన మండలంలో  మండలంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎంఈవో వెంకటేశ్వరస్వామి తెలిపారు. బెజ్జూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌, కస్తూర్బా పాఠశాలలో పది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో రమేష్‌బాబు వివరించారు. కెరమెరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 174 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, మోడి ఆశ్రమోన్నత పాఠశాలలో 180 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు మండల విద్యాశాఖాధికారి సుధాకర్‌ తెలిపారు. చింతలమానేపల్లి మండలంలో మొత్తం 2 సెంటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 288 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కేజీబీవీలో 180 మంది, ప్రభుత్వ పాఠశాలలో 108 మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు చేపట్టారు.  కేజీబీవీలో పరీక్షల సూపరిండెంట్‌గా నానాజీ, ప్రభుత్వ పాఠశాలలో సూపరిండెంట్‌గా క్రిష్ణారావు విధులు నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-05-23T03:57:14+05:30 IST