‘పది’ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-24T05:32:27+05:30 IST

జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్షకు 12,763 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, నలుగురు ప్రైవేట్‌ విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 99.42 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

‘పది’ పరీక్షలు ప్రారంభం
పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, డీఈవో సీహెచ్‌వీ జనార్దన్‌రావు

- మొదటి రోజు 99.42 శాతం విద్యార్థుల హాజరు 

- 74 మంది గైర్హాజరు 

- పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, మే 23: జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్షకు 12,763 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, నలుగురు ప్రైవేట్‌ విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 99.42 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 73 మంది రెగ్యులర్‌, ఒక ప్రైవేట్‌ విద్యార్థి పరీక్షలకు గైర్హాజరైనట్లు డీఈవో సీహెచ్‌వీ జనార్దన్‌రావు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు 8.30 గంటల వరకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9 గంటల నుంచి వారిని లోనికి అనుమతించారు. ఐదు నిమిషాల తర్వాత వచ్చిన వారిని పరీక్షలకు అనుమతించబోమని ముందే హెచ్చరించడంతో విద్యార్థులు ఆలోగానే చేరుకొని పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయడంతోపాటు సమీపంలోని జిరాక్సు కేంద్రాలను మూసివేశారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాలను డీఈవోతో కలిసి ఆకస్మికంగా సందర్శించి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ కరీంనగర్‌ రూరల్‌ పరిధిలోని రెండు పరీక్షా కేంద్రాలను సందర్శించగా, డీఈవో సీహెచ్‌వీ జనార్దన్‌రావు ఏడు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  స్క్వాడ్‌ బృందాలు 29 కేంద్రాలను, అబ్జర్వర్ల బృందం ఎనిమిది కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పకడ్బందీ ఏర్పాట్లతోపాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని, జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, కాపీయింగ్‌ కూడా జరుగలేదని, ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభమయ్యాయని డీఈవో తెలిపారు. 


కొవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలి

- జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ 


పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది విధిగా కొవిడ్‌ నిబంధనలను పాటించి మాస్క్‌ను తప్పకుండా ధరించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశించారు. సోమవారం నగరంలోని ఓల్డ్‌ హైస్కూల్‌, వాణినికేతన్‌ బాల వికాస్‌ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లను అనుమతించవద్దని అన్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ మీడియం ప్రశ్నాపత్రాలు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వేసవి దృష్ట్యా చల్లటి మంచినీటి ని అందుబాటులో ఉంచాలని, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని, సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఓఎంఆర్‌ షీట్‌, ప్రశ్నపత్రాలను కలెక్టర్‌ పరిశీలించారు.  


ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలి

అదనపు కలెక్టర్‌ గరిమాఅగర్వాల్‌ 


పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్‌ కొత్తపల్లి జడ్పీ హైస్కూల్‌, రేకుర్తిలోని ప్యారడైస్‌ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పరీక్షా కేంద్రాల్లో చల్లటి మంచినీటిని అందుబాటులో ఉంచాలని, ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ ఉన్నారు. 

Updated Date - 2022-05-24T05:32:27+05:30 IST