పది రూపాయల డాక్టరమ్మ

ABN , First Publish Date - 2021-02-18T06:12:38+05:30 IST

ఒక లక్ష్యం... ఉన్నతమైన సంకల్పం... గ్రామీణ పేదలకు అతి తక్కువ ఖర్చులో మంచి వైద్యం అందించాలని! ఈ భావమే ఇంధనమై నన్ను నడిపిస్తుంది. విజయవాడలో మాది ఓ పేద కుటుంబం.

పది రూపాయల డాక్టరమ్మ

నాడీ పట్టుకొంటే చాలు... వందల్లో వసూలు చేస్తున్న రోజులివి. రోగం నిర్ణారణ అయ్యేలోపే జేబులు గుల్ల చేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రుల కాలమిది. కానీ ఈ డాక్టరమ్మ..? వైద్యం వ్యాపారంగా మారిన నేటి పరిస్థితుల్లో... వృత్తినే దైవంగా భావించి పేదలకు పది రూపాయలకే సేవలు అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ విశ్రమించక... ‘పది రూపాయల డాక్టరమ్మ’గా కడప గడప గడపకూ చేరువైన యువ వైద్యురాలు  నూరీ పర్వీన్‌ నిస్వార్థ సేవామార్గం ఇది... 


ఒక లక్ష్యం... ఉన్నతమైన సంకల్పం... గ్రామీణ పేదలకు అతి తక్కువ ఖర్చులో మంచి వైద్యం అందించాలని! ఈ భావమే ఇంధనమై నన్ను నడిపిస్తుంది. విజయవాడలో మాది ఓ పేద కుటుంబం. ముగ్గురం సంతానం. నాన్న చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. నాన్న సంపాదన చాలా తక్కువ. అయినా మమ్మల్ని ఉన్నత చదువులు చదివించాలనేది ఆయన పట్టుదల. దాని కోసం అహర్నిశలూ శ్రమించారు. ఆయన అనుకున్నట్టుగానే అక్కను డాక్టర్‌ను చేశారు. నన్నూ అదే బాటలో నడిపించారు. తమ్ముడు కూడా వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. ఇంట్లో ఒక్కరు ఎంబీబీఎస్‌ చదవాలంటేనే ఎన్నో వ్యయప్రయాసలు. అలాంటిది తన ముగ్గురు సంతానాన్నీ నాన్న వైద్య వృత్తి వైపే అడుగులు వేయించడం సామాన్యమైన విషయం కాదనే అనుకుంటున్నా. పేదరికాన్ని అనుభవిస్తూనే... సంప్రదాయ కట్టుబాట్లను అనుసరిస్తూనే... మేము కూడా క్రమశిక్షణతో నడుచుకోవడంవల్లే ఇది సాధ్యమైంది. 


చదువులో టాప్‌... 

మొదటి నుంచి నేను చదువులో ముందుండేదాన్ని. ఇంటర్‌ వరకు విజయవాడలోనే చదివాను. 7, 10 తరగతుల్లో జిల్లా టాప్‌ వచ్చాను. ఇంటర్‌ తరువాత ఎంసెట్‌ రాస్తే కడప ‘ఫాతిమా మెడికల్‌ కాలేజీ’లో సీటు వచ్చింది. కాలేజీ హాస్టల్‌లో ఉంటూ ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. ఆ వెంటనే 2017లో హైదరాబాద్‌లో ఎఫ్‌ఐసీఎం డిప్లమో చదివాను. కొంతకాలం 104 ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందించాను. 


తాతయ్య... నాన్నలే ఆదర్శం... 

నేను డాక్టర్‌ను కావాలనుకున్నది కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేరి కోట్లు సంపాదించుకోవడానికి కాదు! చేతనైనంతలో పేదలకు వైద్యం అందించాలన్నది లక్ష్యం. మా తాత నూర్‌ మహ్మద్‌ ప్రముఖ కమ్యూనిస్ట్‌ నాయకుడు. మా నాన్న చిన్నప్పుడే ఆయన చనిపోయారట. మేము బడికి వెళ్లే రోజుల్లో తాత గొప్పతనం గురించి నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ప్రజల కోసం పోరాడి, ఆ ప్రజల అభ్యున్నతికి పాటుపడిన తీరు కథలు కథలుగా మాకు వివరించేవారు. మా నాన్న కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా ముందుండేవారు. తాత దార్శనికత... నాన్న సేవాభావమే నాకు స్ఫూర్తితోనే ప్రజా సేవ చేయాలని సంకల్పించాను. 


ఊరు వదిలి రానన్నా... 

మెడిసిన్‌ పూర్తియిన వెంటనే ఇంట్లోవాళ్లు, బంధువులు సొంత ఊరు విజయవాడకు వచ్చేయమని ఎంతో ఒత్తిడి చేశారు. అక్కడైతే అంతా అండగా ఉంటామని, ఆస్పత్రి కూడా పెట్టకోవచ్చని సూచించారు. నేను ససేమిరా అన్నాను. వాళ్లు చెప్పింది నిజమే...! నేను పుట్టిన ఊరు... నేను పెరిగిన పరిసరాలు... వెళితే వ్యక్తిగతంగా లబ్ధి పొందుతానేమో! కానీ నేను కన్న కలలకు రూపం ఇవ్వలేను. అందరిలా నేనూ ఒక డాక్టర్‌ని... అంతే! అది నాకు నచ్చలేదు. ఇది పవిత్రమైన వృత్తి. కొన్ని కార్పొరేట్ల పోటీలో పేవాడికి మెరుగైన వైద్యం అందకుండా పోయింది. అందుకే నేను మెడిసిన్‌ చదివిన కడప నగరంలోనే సామాన్యులకు అతి తక్కువ ధరలో సరైన వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాను. 


నీ వల్ల ఏమంతుందన్నారు... 

సేవ చేయాలనైతే నిర్ణయం తీసుకున్నాను. కానీ ఎలా? తొలుత ఏం చేయాలో తోచలేదు. ఎవరెవరినో సలహా అడిగితే... ‘ఆడపిల్లవు నీవల్ల ఏమవుతుంద’న్నారు. నాకు అర్థం కానిదేమిటంటే... ఆడపిల్ల అయినంత మాత్రాన వారికంటూ లక్ష్యాలు, సొంత అభిప్రాయాలంటూ ఉండవా? ప్రోత్సహించక్కర్లేదు... కనీసం సాధించాలనుకున్న కలను మొగ్గలోనే తుంచేయకుండా ఉంటే చాలు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో అమ్మా నాన్నలు నాకు అండగా నిలిచారు. మేమున్నామని ధైర్యాన్నిచ్చారు. తరువాత ఆలోచిస్తుంటే చౌకగా వైద్య సేవలు అందిస్తే బాగుంటుందనిపించింది. వెంటనే ‘నూరిస్‌ హెల్త్‌కేర్‌ క్లినిక్‌’ ప్రారంభించాను. కేవలం పది రూపాయలకే వైద్యం అందిస్తున్నాను. ప్రస్తుతం రోజుకు యాభై నుంచి వంద మంది రోగులకు చికిత్స అందిస్తున్నాను. 


లాక్‌డౌన్‌లోనూ జంకలేదు... 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న రోజులవి. లాక్‌డౌన్‌ సమయంలో సామాన్యులే కాదు, కొందరు వైద్యులు కూడా ఇంటి నుంచి బయటకు రాలేదు. మా క్లినిక్‌ కూడా మూత పడింది. ‘అమ్మా... తీవ్ర జ్వరం వస్తోంది. ఒళ్లు నొప్పులుగా ఉన్నాయి’ అంటూ తరచూ గ్రామంలోనివారు ఫోన్లు చేస్తుండేవారు. వింటుంటే కళ్లు చమర్చేవి. అలా ఆపదలో ఉన్నవారికి మనం వైద్యం అందించలేమా? ఈ ప్రశ్న నాకు నిద్ర పట్టనివ్వలేదు. అదే సమయంలో మా మెడికల్‌ కాలేజీని కొవిడ్‌ సెంటర్‌గా మార్చారు. అక్కడి హాస్టల్‌లో ఉంటున్న నేను స్వచ్ఛందంగా వెళ్లి కరోనా బాధితులకు సేవలు చేస్తున్నా. ‘ఇంత చిన్న వయసులో రిస్క్‌ తీసుకొంటావెందుకమ్మా’ అని తోటి వైద్యులు హెచ్చరించారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. ఆ తరువాత నా క్లినిక్‌ ఓపెన్‌ చేసి కరోనా సమయంలో కూడా రూ.10కే వైద్యం అందిస్తున్నా. ‘మరీ అంత తక్కువ ఫీజు ఏంటి? ఎక్కువ తీసుకో’ అంటూ చాలామంది స్నేహితులు, వైద్యులు సలహాలిచ్చారు. అయితే ఇది నా ఆశయ స్ఫూర్తికి విరుద్ధం. 


పేదలకు ఆహారం... 

కేవలం వైద్య సేవలకే నేను పరిమితం కాలేదు. కరోనా విపత్కాలంలో ఉన్నంతలో కొందరికైనా సాయం చేయాలనిపించింది. దీంతో రోజుకు కనీసం వంద మందికి తగ్గకుండా యాభై రోజుల పాటు పేదలకు ఉచితంగా భోజనాలు పెట్టాను. వందకు పైగా పేద కుటుంబాలకు రూ.1,500 విలువ చేసే నిత్యావసరాలు అందించాను. ‘ఇన్‌స్పైరింగ్‌ హెల్త్‌ ఇండియా, నూరీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ’ల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇది నాకు ఎంత సంతృప్తిని, సంతోషాన్నీ ఇస్తుంది. ఒక్కోసారి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో వాళ్లని అడిగి తెచ్చుకొంటాను. ఏదిఏమైనా పేదలకు వైద్యం ఆగకూడదన్న ఏకైక లక్ష్యంతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. 



నేను డాక్టర్‌ కావాలనుకున్నది కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరి కోట్లు సంపాదించుకోవడానికి కాదు! చేతనైనంతలో పేదలకు వైద్యం అందించాలన్నది నా లక్ష్యం. వైద్యవృత్తి పవిత్రమైనది. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ పోటీలో పేదవాళ్లకు మెరుగైన వైద్యం అందకుండా పోయింది. అందుకే నేను మెడిసిన్‌ చదివి  కడప నగరంలోనే సామాన్యులకు అతి తక్కువ ధరలో సరైన వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాను.


 గోరంట్ల కొండప్ప 

ఫొటోలు: టి.రత్నయ్య 

Updated Date - 2021-02-18T06:12:38+05:30 IST