నెల రోజుల్లో ‘పది’ ఫలితాలు!

ABN , First Publish Date - 2022-05-23T08:42:13+05:30 IST

పదో తరగతి ఫలితాలను నెల రోజుల్లో ప్రకటించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

నెల రోజుల్లో ‘పది’ ఫలితాలు!

  • నేటి నుంచి వార్షిక పరీక్షలు.. 
  • ఈ సారి ఆరు పేపర్లకు నిర్వహణజూన్‌ 
  • 2 నుంచి స్పాట్‌ వాల్యుయేషన్‌
  • జూన్‌ నెలాఖరులోగా ఫలితాలు

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాలను నెల రోజుల్లో ప్రకటించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో సోమవారం నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు రాసే సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని జూన్‌ 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. జూన్‌ నెలాఖరులోగా వీటి ఫలితాలను ప్రకటించడానికి చర్యల్ని తీసుకుంటున్నారు. కరోనా కారణంగా అధికశాతం ఆన్‌లైన్‌ క్లాసులు జరిగిన నేపథ్యంలో ఈ ఏడాది పరీక్ష విధానంలో మార్పులు చేశారు. 70ు సిలబ్‌సతో.. 11కు బదులు ఆరు పేపర్లకు సంబంధించిన పరీక్షలను మాత్రమే విద్యార్థులు రాయనున్నారు. రాష్ట్రంలో 5,09,275 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలను రాయనున్నారు. వీరిలో 2,58,098 బాలురులు, మరో 2,51,177 మంది బాలికలున్నారు. మొత్తం 11,401 పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియనున్నాయి. అయితే.. ఓఎ్‌సఎ్‌ససీ, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షలు జూన్‌ 1వ తేదీలోపు పూర్తి కానున్నాయి. జూన్‌ 2వ తేదీ నుంచి స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. నెల రోజుల్లో వీటి ఫలితాలను ప్రకటించడానికి వీలుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


2,861 సెంటర్లు

పరీక్షల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో 2,861 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం సుమారు 38 వేల మంది సిబ్బందిని, 144 ప్లయింగ్‌ స్వ్యాడ్‌లను నియమించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పా టు చేశారు. ఎండల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్‌ టీంలను ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం, విద్యుత్తు సరఫరాలో లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణ కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసే 040-23230942 ఫోన్‌ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చారు. పరీక్ష తొలి రోజు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు కేంద్రానికి రావాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల వరకు అనుమతించనున్నారు. అంటే.. ఉదయం 9.35 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించరు. విద్యార్థులు రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేలు వంటి  వాటిని తీసుకెళ్లాలి. 


విద్యార్థులకు మంత్రి సబిత ‘ఆల్‌ ద బెస్ట్‌’

సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను మంచిగా రాయాలని విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ మేరకు  ఆదివారం ఆమె తన ట్విట్టర్‌ ద్వారా విద్యార్థులకు ‘ఆల్‌ ద బెస్ట్‌’ చెప్పారు. ఈ పరీక్షలను బాగా రాసి, మంచి ఫలితాలను సాధించాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పట్ల అధికారులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన చర్యల్ని ఆదేశించారు. 


రేపటితో ముగియనున్న ఇంటర్‌ పరీక్షలు

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నెల 6న ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 19తోనే ప్రధాన పరీక్షలు పూర్తయ్యాయి. సోమ, మంగళవారాల్లో మోడరన్‌ ల్యాంగ్వేజీ, జాగ్రఫీ పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరుగనున్నాయి. ఇప్పటికే పూర్తయిన పరీక్షలకు సంబంధించి సుమారు 15 వేల మంది సిబ్బందితో మూల్యాంకనాన్ని ప్రారంభించారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదివారం స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. నెల రోజుల్లో ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.

Updated Date - 2022-05-23T08:42:13+05:30 IST