Abn logo
Mar 4 2021 @ 01:23AM

ఓటేసినందుకు వెలేశారు!

పది కుటుంబాల వెలి

కాజులూరు (కరప), మార్చి 3: తాము చెప్పిన వ్యక్తికి ఓటేయలేదనే కాజులూరు మండలం జగన్నాఽథగిరి పంచాయతీకి సంబంధించిన పెద్దలు ఓ పది కుటుంబాలను వెలేశారు. దీంతో బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు...తాము సూచించిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి ఓటేయడం వల్ల ఓడిపోవడంతో పాటు, పందెంలో రూ.15 లక్షలు కోల్పోయామని గుత్తులవారిపేటకు చెందిన పెద్దలు పేటలోని పది కుటుంబాలపై కక్ష పెంచుకుని వెలేశారు.  ఇకపై పేటలో ఎవరూ వారితో మాట్లాడరాదని, పెళ్లిళ్ళకు, ఫంక్షన్‌లకు పిలవరాదని సంఘ పెద్దలు తీర్మానం చేశారు. సంఘంలో జాయిన్‌ అవ్వాలంటే ఇంటికి రూ.10వేలు చొప్పున సంఘానికి కట్టాలని ఆదేశించారు. దీనిపై గొల్లపాలెం స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో టేకుమూడి శ్రీరాములు, గోవిందమ్మ, మేడిశెట్టి ఏడుకొండలు, భీమేశ్వరరావు, నరాల నూకరాజు, రాయుడు గోవిందరాజు, విజయలక్ష్మి, రాయుడు నాగరాజు, అనంతలక్ష్మి, మేడిశెట్టి వెంకటరమణ, సీతారత్నం, గుత్తుల చంద్రరావు, భూరమాదవి, గుత్తుల నాగరాజు, లక్ష్మి, చింతపల్లి దుర్గ, కుమారి, నరాల కోదండరామయ్య, పార్వతి తదితరులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి బుధవారం కాజులూరు వచ్చారని కలవడానికి వెళ్లగా పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement
Advertisement