కాంగ్రెస్‌ బలోపేతానికి పది రోజుల పాదయాత్ర

ABN , First Publish Date - 2022-08-07T06:14:38+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఈ నెల 9వ తేదీ నుంచి 18వరకు పది రోజుల పాటు కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ తెలిపారు. శనివారం ఆయన హుస్నాబాద్‌ పట్టణంలోని వైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ బలోపేతానికి పది రోజుల పాదయాత్ర
పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న పొన్నం ప్రభాకర్‌

దేశాన్ని పురోగతిలో నడిపించిన ప్రధానులను మరచిపోయేలా బీజేపీ కుట్ర 

భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు పరిమితం..కేసీఆర్‌ను జైల్లో పెడతామనడం తప్ప బండి సంజయ్‌ చేసిందేమి లేదు

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ఉప ఎన్నికలా ?

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ 


హుస్నాబాద్‌, ఆగస్టు 6 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఈ నెల 9వ తేదీ నుంచి 18వరకు పది రోజుల పాటు కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ తెలిపారు. శనివారం ఆయన హుస్నాబాద్‌ పట్టణంలోని వైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనికి ముందు పాదయాత్ర విజయవంతం కావాలని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ త్యాగం, ఈ దేశ నిర్మాణంలో పార్టీ పాత్రను ఇప్పటి తరాలకు గుర్తు చేసేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నామన్నారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ నుంచి ఇందిరాగాంధి, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్‌ సింగ్‌ దేశ పురోగతికి ఎంతో చేశారని వెల్లడించారు. వీరిని మరచిపోయే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్‌ అభివృద్ధిని మరచి భాగ్యలక్ష్మీ టెంపుల్‌కే పరిమితమయ్యాడని, కేసీఆర్‌ను జైల్లో పెడతామనడం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. బీజేపీ తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు. 108 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ తాము గొప్ప అని చెప్పడానికి ఉప ఎన్నికలు తెస్తుందన్నారు. దీని వల్ల ప్రజాధనం ధుర్వినియోగం చేస్తున్నదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇంకా అనేక ఉప ఎన్నికలు వస్తాయనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు ముఖాముఖీగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేటలో మొదలై హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి వరకు 125 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని తెలిపారు. దీనిని ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, నాయకులు కోమటి సత్యనారాయణ, ఏ.శ్రీనివాస్‌, సీహెచ్‌.పద్మ, బి.చందు, ఎం.దర్మయ్య, అయిలయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T06:14:38+05:30 IST