పది బొక్కబోర్లా..!

ABN , First Publish Date - 2022-06-08T06:44:11+05:30 IST

‘వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం పాసవ్వాలి. సంక్షేమశాఖల అధికారులు నిత్యం పర్యవేక్షించాలి

పది బొక్కబోర్లా..!
ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల కార్యాలయాలు

సంక్షేమ హాస్టళ్లలో వైఫల్యం.. సంపూర్ణం

వందశాతం అన్నారు.. 50 కూడా లేదు

చాలా హాస్టళ్లలో వంద శాతం ఫెయిల్‌

కొన్ని చోట్ల ఒక్కో విద్యార్థి పాస్‌

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూన 7: ‘వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం పాసవ్వాలి. సంక్షేమశాఖల అధికారులు నిత్యం పర్యవేక్షించాలి. వార్డెన్లు స్థానికంగా ఉండి, స్టడీ అవర్స్‌ను పక్కాగా నిర్వహించాలి’ అని కలెక్టర్‌ ఆదేశించారు. పదే పదే సమీక్షలు నిర్వహించారు. ఏం లాభం..? వందశాతం అటుంచితే.. 50 శాతం కూడా నమోదు కాలేదు. జీరో పర్సంటేజీ కూడా వచ్చాయంటే ఏమనుకోవాలి..? వైఫల్యానికి సంక్షేమ శాఖల ఉన్నతాధికారుల నుంచి వార్డెన్ల వరకూ అందరూ బాధ్యులే అన్న విమర్శలు వస్తున్నాయి.  


ఫెయిల్యూర్‌..

జిల్లాలో బీసీ సంక్షేమశాఖ పరిధిలో 36 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 589 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాశారు. 240 మంది పాసయ్యారు. 349 మంది ఫెయిల్‌ అయ్యారు. ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలోని 35 వసతిగృహాల్లో 436 మంది పరీక్షలు రాయగా... 106 మంది పాసయ్యారు. 330 మంది ఫెయిల్‌ అయ్యారు. ఎస్టీ సంక్షేమశాఖ పరిధిలో రెండు జిల్లాలోని వసతి గృహాల్లో 86 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... కేవలం 11 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏకంగా 75 మంది ఫెయిల్‌ అయ్యారు. 11 ఎస్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 441 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 174 మంది ఉత్తీర్ణత సాధించారు. 267 మంది ఫెయిల్‌ అయ్యారు. 


ఒక్కరు కూడా..

బుక్కరాయసముద్రం ఎస్సీ బాలుర వసతిగృహంలో పరీక్షలు రాసిన మొత్తం 12 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. వజ్రకరూరు ఎస్సీ బాలికల వసతిగృహంలో పరీక్షలు రాసిన మొత్తం 8 మంది ఫెయిల్‌ అయ్యారు. చాబాల బాలుర వసతిగృహంలో 13 మంది ఫెయిల్‌ అయ్యారు. గుత్తిలో నెం.1  బాలుర వసతిగృహం నుంచి ఇద్దరు పరీక్షలు రాసి.. ఫెయిల్‌ అయ్యారు. సోమలాపురం ఎస్సీ బాలుర వసతిగృహం నుంచి 8 మంది పరీక్షలు రాయగా... అందరూ ఫెయిల్‌ అయ్యారు. 


ఒక్కరే..

శింగనమల ఎస్సీ బాలుర వసతిగృహంలో 13 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఒక్కరు మాత్రమే పాసయ్యారు. నార్పల ఎస్సీ బాలికల వసతి గృహంలో 11 మంది పరీక్షలు రాయగా, ఒక్కరు మాత్రమే పాసయ్యారు. గడేకల్లులోని బాలుర వసతిగృహం నుంచి 20 మందికిగానూ ఒక్కరు, తాడిపత్రి బాలికల వసతిగృహంలో ఏడుగురికి ఒక్కరు, కళ్యాణదుర్గంలోని ఎస్సీ బాలుర నెం.1 హాస్టల్‌లో ఏడుగురికి ఒక్కరు పాసయ్యారు. బెళుగుప్ప బీసీ బాలుర వసతిగృహంలో ఆరుగురికి ఒక్కరు, రాగులపాడు ఎస్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 31 మందికి ఒక్కరు పాసయ్యారు. 


వారి వైఫల్యం..

పదో తరగతి విద్యార్థుల పట్ల శ్రద్ధ పెట్టాలని వార్డెన్లు, పర్యవేక్షణ అధికారులకు ముందే చెప్పాం. ఇది విద్యార్థుల ఫెయిల్యూర్‌ కాదు.. వార్డెన్లు, పర్యవేక్షణ అధికారుల వైఫల్యం. వార్డెన్లు అందుబాటులో ఉండలేదు. స్టడీ అవర్స్‌ను సక్రమంగా నిర్వహించలేదు. పర్యవేక్షణ అధికారులు పట్టించుకోలేదు. అందుకే ఇలా జరిగింది. 

- విశ్వమోహనరెడ్డి, ఎస్సీ సంక్షేమశాఖ ఈఓ


ఉపాధ్యాయుల కొరతతోనే..

వసతిగృహాల్లో స్టడీ అవర్స్‌ నిర్వహించేందుకు ఉపాధ్యాయుల కొరత ఉన్నింది. వారికి సకాలంలో వేతనాలు అందలేదు. కొవిడ్‌ వల్ల సిలబస్‌ పూర్తికాలేదు. వచ్చే ఏడాది మంచి ఫలితాలు సాధించేదిశగా చర్యలు తీసుకుంటాం.

- అన్నాదొర, జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి


పరిశీలిస్తాం..

ఎక్కడ తప్పిదం జరిగిందో ప రిశీలిస్తాం. వచ్చే విద్యాసంవత్సరం మెరుగైన ఫలితాల సాధన కోసం కృషి చేస్తాం. ముందస్తు ప్రణాళికలతో ఉత్తమ ఫలితాల సాధించేం దుకు అధికారులను సమాయత్తం చేస్తాం.

- కుష్బూకొతారీ, బీసీ సంక్షేమశాఖ ఈఓ

Updated Date - 2022-06-08T06:44:11+05:30 IST