ప్రలోభమొక్కటే బీజేపీ నమ్మే విలువ!

ABN , First Publish Date - 2022-07-13T06:16:52+05:30 IST

ఒకవిజయం అనేక వైఫల్యాలను కప్పి పుచ్చుతుందనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా కనిపిస్తోంది. గత ఎనిమిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో అనేక ప్రశ్నార్థకమైన, విమర్శించదగ్గ నిర్ణయాలు...

ప్రలోభమొక్కటే బీజేపీ నమ్మే విలువ!

ఒకవిజయం అనేక వైఫల్యాలను కప్పి పుచ్చుతుందనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా కనిపిస్తోంది. గత ఎనిమిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో అనేక ప్రశ్నార్థకమైన, విమర్శించదగ్గ నిర్ణయాలు జరిగినప్పటికీ అవి అన్నీ బిజెపి విజయాల వెల్లువలో కొట్టుకుపోయాయి. దేశంలో ప్రతిపక్షాలు నిర్వీర్యమైనప్పుడు, లేదా ప్రతిపక్షమే లేనప్పుడు సాధించిన విజయాలు ప్రజల ఆమోదానికి చిహ్నంగా భావించడానికి వీలు లేదు. అధికారంలోకి రావడానికి, అధికార విస్తరణకు బిజెపి పూర్తిగా తన పట్ల ఉన్న ప్రజాదరణపై ఆధారపడదన్న విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. అసలు దేశ రాజకీయాల్లో తమ విధానాల ద్వారా, మంచి పనుల ద్వారా ఒక పార్టీ ప్రజల మెప్పును పొంది అధికారంలోకి వస్తుందనే నమ్మకాలు రోజురోజుకూ సడలిపోతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎన్ని రకాల వ్యూహాలను అవలంబించాలో, ఎంతమందిని చీల్చాలో, మరెంతమందిని భయభ్రాంతుల్ని చేయాలో, ఎన్ని వర్గాలను తమ వైపుకు తిప్పుకోవాలో అన్న విషయంలో గతంలో కాంగ్రెస్ కొన్ని విధానాలను అవలంబించేది. ఇప్పుడు బిజెపి ఈ విద్యలో తనను మించిన వారెవరూ లేరని నిరూపించుకుంటోంది. ఒక పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తుందో, ప్రజలెందుకు ఆ పార్టీకి ఓటు వేస్తున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొనడమే నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం చూస్తున్న ఒక దుష్పరిణామం.


మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు వర్గం అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు కాకముందే గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరిగాయి. నిజానికి గోవాలో బిజెపి ప్రభుత్వం ఉండనే ఉన్నది. తమ ప్రభుత్వం సాగడానికి మరికొందరు ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు. అయినప్పటికీ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సాధ్యమైనంత మందిని తిప్పుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఒక్కొక్కరికీ రూ.15కోట్ల చొప్పున చెల్లించేందుకు బేరాలు కుదిరాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి దినేష్ కామత్, ప్రతిపక్ష నాయకుడు లోబోతో సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపి వశీకరణ మంత్రానికి గురయ్యారు. ఈ పరిణామాలతో నిమిత్తం లేదన్నట్లుగా కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళితే, ఇటీవలే ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్న సోనియాగాంధీ ఏదో రకంగా గోవాలో కాంగ్రెస్ శాసన సభా పార్టీ చీలకుండా కాపాడేందుకు తంటాలు పడుతున్నారు. గోవాలో కాంగ్రెస్‌ను చీల్చి తమ వైపుకు తిప్పుకోవడం మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోనూ బిజెపి ఇదే వ్యూహాన్ని అనుసరించింది.


అసలు ఒక రాష్ట్రంలో ప్రతిపక్షాలను చీల్చేందుకు తామే అధికారంలోకి వచ్చేందుకు బిజెపి నాయకత్వానికి ఎందుకింత ఆతురత? అంతటా అధికారం తమదైతే ప్రశ్నించే వారుండరనేదే ఆ పార్టీ ధీమాలాగా కనపడుతోంది. రాజకీయ ఆధిపత్యం సంపాదించుకోవడం ద్వారా తాము చేస్తున్న పనుల మంచి చెడ్డలను ప్రశ్నించేందుకు ఎవరికీ నైతిక అర్హత ఉండదని బిజెపి భావిస్తున్నట్లు కనపడుతోంది. అయినప్పటికీ భారతదేశ రాజకీయాల్లో ఒకే ఒక పార్టీ ఆధిపత్యం ఏర్పడేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం అంత సులభం మాత్రం కాదు.


ఉదాహరణకు మహారాష్ట్రలో బిజెపి శివసేన–ఎన్‌సిపి–కాంగ్రెస్‌లతో కూడిన ఉద్దవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టింది కాని శివసేనకు అధికారం అప్పగించకుండా ఉండలేకపోయింది. చాలా మంది మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేకు అధికారం అప్పగించడాన్ని మోదీ–అమిత్ షాల మాస్టర్ స్ట్రోక్‌గా భావిస్తున్నారు కాని అది తప్పనిసరి రాజకీయ పరిణామం అని అనేవారు కూడా ఉన్నారు. 2020లో బీహార్‌లో కూడా బిజెపి ఇవే రాజకీయాలు చేయాలని ప్రయత్నించింది కాని నితీష్ కుమార్‌కు తప్పనిసరిగా అధికారం అప్పజెప్పాల్సి వచ్చింది. చిరాగ్ పశ్వాన్ ద్వారా జనతాదళ్(యు)ను బలహీనపరచాలని యత్నించింది కాని తర్వాతి పరిణామాల్లో భాగంగా కేవలం 43 సీట్లు గెలిచిన నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. 74 సీట్లు గెలిచినప్పటికీ బిజెపి జనతాదళ్(యు)కు తోకలా ఉండాల్సి వచ్చింది. బీహార్ వరకు వచ్చేసరికి మోదీ ఎన్డీఏ నేత కాదు, నితీష్ కుమారే ఎన్డీఏ నేత. నితీష్ కుమార్ ఒకప్పటి ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి, జనతాదళ్(యు) ఎంపీ ఆర్‌సిపి సింగ్‌ను మోదీ తన మంత్రివర్గంలో చేర్చుకున్నప్పటికీ ఆయనను కొనసాగించలేకపోయారు. తన రాజకీయ ప్రయోజనాలు కాపాడలేనందుకు ఆర్‌సిపి సింగ్‌ను నితీష్ రాజ్యసభకు పంపకపోవడంతో మంత్రివర్గానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బిజెపి ఏక్‌నాథ్ షిండేను కాదని ఏదీ చేయలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పక తప్పదు. నిజానికి ఆఖరు క్షణం వరకూ బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని బిజెపిలో కూడా చాలా మంది భావించారు. కాని ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేయడంతో పాటు ఒకప్పుడు శివసేనకు చెందిన రాహుల్ నావ్‌కర్‌ను కూడా స్పీకర్ చేసేందుకు బిజెపి ఒప్పుకోక తప్పలేదు. అంటే అధికారం ఎవరి చేతుల్లో ఉన్నట్లు? 2019లో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రతిపాదించినట్లు రెండున్నరేళ్ల చొప్పున అధికారం పంచుకోవాలనే షరతును అంగీకరించి ఉంటే ఇవాళ మహారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉండేది. కాని వ్రతం చెడ్డా ఫలం దక్కదన్నట్లు బిజెపికి మరో శివసేన నేతనే ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చింది. చివరకు తాను అధికారంలోకి రావడానికి రాజకీయ క్రీడను ఎంత పకడ్బందీగా చేసినప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి ముఖ్యమంత్రి కావడంలో విఫలమయ్యారు. ఒకసారి అర్ధరాత్రి రాష్ట్రపతి, గవర్నర్‌తో సహా రాజ్యాంగ వ్యవస్థలనన్నీ హాస్యాస్పదం చేస్తే రెండోసారి కోట్లాది రూపాయలు వెచ్చించి రిసార్టు రాజకీయాలకు పాల్పడాల్సి వచ్చింది. అయినా ఉపముఖ్యమంత్రి పదవితో సంతృప్తి పడాల్సి వచ్చింది. దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహించాల్సి రావడం అరుదు. నిజానికి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉంటే హైదరాబాద్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయనే హీరోగా కనిపించేవారు. కాని ఆయన అసలు కార్యవర్గ సమావేశాలకు హాజరుకానే లేదు. గౌహతిలో ఆయన తరఫున రిసార్టు రాజకీయాలకు ప్రోత్సాహం ఇచ్చిన మాజీ కాంగ్రెస్ నేత, ఇప్పటి బిజెపి ముఖ్యమంత్రి హేమంత బిశ్వాస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని బలపరుస్తూ మోదీ పై ప్రశంసల వర్షం కురిపించడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. బహుశా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో వైఫల్యం నుంచి మనసు మళ్లించి సంతృప్తి చెందేందుకే గోవాలో బిజెపి చీలిక రాజకీయాలను ప్రోత్సహించి ఉండవచ్చు.


మహారాష్ట్ర, బీహార్‌లలో మాత్రమే కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీకి అంత అనుకూల పరిస్థితులు లేవు. మహారాష్ట్రలో కూడా రెండేళ్ల తర్వాత శివసేన మళ్లీ థాకరే కుటుంబంలోకి పోకుండా ఉంటుందని చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ‘శివసేన ఎమ్మెల్యేలు షిండే వైపు వెళ్లి ఉండవచ్చు కాని శివసైనికులు మాత్రం థాకరే కుటుంబంతోనే ఉన్నారు’ అని ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు సుదీంద్ర కులకర్ణి చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో ఎన్ని పరిణామాలు వచ్చినా అవి కుటుంబ రాజకీయాలకు, మూల నాయకులకు భిన్నంగా మారే అవకాశం చాలా తక్కువ. అందుకే ఒడిషాలో నవీన్ పట్నాయక్, తమిళనాడులో స్టాలిన్ బలంగా ఉండగలుగుతున్నారు. యుపిలో అఖిలేష్ యాదవ్, బీహార్‌లో తేజస్వియాదవ్‌లను పూర్తిగా తుడిచిపెట్టలేని పరిస్థితి ఉంటే, కాన్షీరామ్, మాయావతి స్థాపించిన బహుజన సమాజ్ పార్టీలో ఎన్ని చీలికలు వచ్చినా, ఎంత మంది పార్టీ మారినా బిఎస్‌పి నుంచి కొత్తవారు గెలుస్తూనే ఉన్నారు.


విచిత్రమేమంటే తెలంగాణలో కూడా ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని కొందరు రాష్ట్ర బిజెపి నేతలు ప్రచారం చేయడం ఆశ్చర్యకరం. అంటే ఒక పార్టీని చీల్చి, ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ వైపుకు తిప్పుకోవడం సరైనదిగా ఆ పార్టీ నేతలే భావించడం, పైగా బహిరంగ ప్రకటనలు కూడా చేయడం ప్రజాస్వామ్యం పట్ల వారికున్న అపారమైన విశ్వాసానికి నిదర్శనం. అటువంటప్పుడు అది ఇతర పార్టీలకంటే బిజెపి భిన్నమైన పార్టీ ఎలా అవుతుంది? ఇతర పార్టీలను చీల్చడంద్వారా, ఆ పార్టీలకు చెందిన నేతలను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా తాము బలపడాలనుకోవడం రాజకీయాల్లో ఒక సహజమైన ప్రక్రియ కానే కాదు. కేసిఆర్ నాయకత్వంపై టీఆర్ఎస్‌లో నిజంగా తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతూ ఉంటే బిజెపి ప్రయత్నాలు చేయకపోయినా సహజంగా తిరుగుబాటు జరుగుతుంది. అదే విధంగా బిజెపి పట్ల ప్రజల్లో ఉప్పొంగిన జనాదరణ ఉంటే, ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినట్లు తెలంగాణలో బిజెపి కూడా అధికారంలోకి వస్తుంది. కాని సహజ పరిణామాలకోసం వేచి చూస్తూ, అందుకోసం జనాదరణ పొందేందుకు ప్రయత్నాలు చేసే ఓపిక బిజెపికి ఉన్నట్లు లేదు. అందువల్ల బిజెపి చేసే ప్రతి పనిలో ఒక అసహనం కనపడుతుంది. ఇది ఇట్లా ఉంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీని, ఆయన చేస్తున్న విధానాలను తూర్పారబట్టడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పైచేయి సాధించాలని కేసిఆర్ ప్రయత్నిస్తున్నారు. ఆయన మోదీపై చేస్తున్న విమర్శలు గత ఎనిమిదేళ్లుగా ఎంతోమంది చేస్తూనే ఉన్నారు, అయినా మోదీ విజయాల్ని వారు ఆపలేకపోయారు. అంతే కాదు, కేసిఆర్ వ్యాఖ్యల్ని జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రంలోనూ ఎందరు సీరియస్‌గా తీసుకుంటున్నారన్న దానిపై ఆయన వ్యాఖ్యల ప్రభావం ఆధారపడి ఉంటుంది. నూపుర్ శర్మపై చేసిన వ్యాఖ్యలకు తప్ప జాతీయ మీడియాలో కేసిఆర్ మాటలకు అంత ప్రాధాన్యత లభించకపోవడాన్ని ఆయన ఇప్పటికే గమనించి ఉంటారు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-07-13T06:16:52+05:30 IST