Abn logo
Apr 10 2020 @ 04:40AM

ఠాణాకో టన్నెల్‌

ఆంధ్రజ్యోతి, విజయవాడ : కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు మన వద్దకు వచ్చేవారి ఒంటిపై ఉన్న సూక్ష్మక్రిములను నిర్వీర్యం చేయాలని భావించారు విజయవాడ పోలీసులు. ఇందుకోసం సూక్ష్మజీవుల సంహారక రసాయనాలను జల్లే టన్నెల్స్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సెంట్రల్‌ కంప్లైంట్‌ సెల్‌ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.


కార్యాలయానికి వచ్చిన అధికారులు, ఉద్యోగులు, సందర్శకులు ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు నిలబడితే దుస్తులు, చర్మంపై ఉన్న సూక్ష్మజీవులు నిర్వీర్యమైపోతాయి. ఏసీటీ ఆధ్వర్యంలో రూ.1.50 లక్షలతో కమిషనరేట్‌లో ఈ సేఫ్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. దీనికన్నా తక్కువ ఖర్చుతో తయారయ్యే సేఫ్‌ టన్నెల్‌ను అన్ని పోలీసు స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 20 స్టేషన్లు ఉన్నాయి. వాటిన్నింటిలోనూ త్వరలోనే డిజ్‌ ఇన్‌ఫెక్షన్‌ సేఫ్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ చెప్పారు. 


ఇలా పనిచేస్తుంది

కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో తాత్కాలిక సేఫ్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, పంజాబ్‌లోని మార్కెట్లలో ఈ తరహా టన్నెల్‌ను నెలకొల్పారు. శాశ్వతంగా ఏర్పాటు చేసే టన్నెల్‌కు వ్యయం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల రూ.30వేల ఖర్చుతో పూర్తయ్యే టన్నెల్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు సంకల్పించారు. గుహ ఆకారాన్ని పోలినట్టుగా వస్త్రాలతో బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. దానికి రెండు వైపులా శుభకార్యాల్లో పన్నీరును చల్లే యంత్రాలను అమర్చుతారు. వాటికి అనుబంధంగా ఒక పెద్ద డబ్బాలో బెటాడిన్‌, హైపోక్లోరైడ్‌ కలిపిన మిశ్రమాన్ని పోస్తారు. అందులో నుంచి ఒక పైపును ఈ యంత్రాలకు కలుపుతారు. ఈ మోటార్లు తిరుగుతున్నప్పుడు ఈ రసాయనాల మిశ్రమం జల్లు రూపంలో బయటకు వస్తుంది. ఈ జల్లులో 20 సెకన్ల పాటు నిలబడితే దుస్తులు, శరీరంపై ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి. 


Advertisement
Advertisement
Advertisement