రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు తాత్కాలిక బ్రేక్‌

ABN , First Publish Date - 2021-05-15T06:01:29+05:30 IST

రెండో డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లుగా ఆసీనులు కావాలనుకునే వారు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు తాత్కాలిక బ్రేక్‌
అనంతపురం మున్సిపల్‌ కార్యాలయం

 కొవిడ్‌ నేపథ్యమే కారణం 

  నిరాశలో ఆశావహులు

అనంతపురం కార్పొరేషన్‌, మే14: రెండో డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లుగా ఆసీనులు కావాలనుకునే వారు మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నగర పాలక సంస్థలో రెండో డిప్యూటీ మేయర్‌, మున్సిపాలిటీల్లో రెండో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నియామకాలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరి నియామకానికి ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. కొవిడ్‌ కారణంగా ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో చట్టపరంగా ఇబ్బందులు ఎదురవకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం షెడ్యూల్‌ మేరకు ఎన్నికలు నిర్వహించని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొదటి సమావేశానికి రెండు వారాల ముందు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు నివేదించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌ ఎన్నికను వాయిదా వేసి, మరో తేదీని నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


నేతల్లో నిరాశ...

మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తికాగానే అందరి చూపూ రెండో డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మీద పడింది. ఎప్పుడెప్పుడా అని చూస్తూ వచ్చిన ఆ పదవి దూరమవుతుండటంతో... ఆశావహులు నిరాశ చెందుతున్నారు. మార్చి నెలలో జిల్లాలో అన్నింటిలోనూ పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. దీంతో రెండో పీఠం కోసం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తీవ్ర ప్రయత్నాలు సాగించారు. ఎప్పటిలాగే అనంతపురం కార్పొరేషన్‌లో ఈ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఇదివరకే ఉన్న అసంతృప్తికి ఈ రెండో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి మరింత ఇరకాటంలో పెట్టే పరిస్థితులు లేకపోలేదు. ఇక కరోనా ఉధృతి తగ్గాలంటే జూన్‌ రెండో వారమైనా పట్టే అవకాశముంది. ఏదేమైనా అప్పటివరకు ఆ సీటులో కూర్చోవాలనుకునే వారు తమ ప్రయత్నాలను మరింత ఎక్కువ చేస్తారనడంలో సందేహం లేదు. మరి ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో తేలాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.


Updated Date - 2021-05-15T06:01:29+05:30 IST