బ్రహ్మోత్సవాలకు చెన్నకేశవస్వామి ఆలయం ముస్తాబు

ABN , First Publish Date - 2022-05-15T06:42:06+05:30 IST

కాకతీయుల కాలంలో మండలంలోని కరవిరాలలో నిర్మించిన శ్రీదేవి, భూదేవీ సమేత స్వయంభు చెన్నకేశవస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు ఆ

బ్రహ్మోత్సవాలకు చెన్నకేశవస్వామి ఆలయం ముస్తాబు
కరవిరాలోని చెన్నకేశవ స్వామి ఆలయం

నడిగూడెం, మే 14: కాకతీయుల కాలంలో మండలంలోని కరవిరాలలో నిర్మించిన శ్రీదేవి, భూదేవీ సమేత స్వయంభు చెన్నకేశవస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. 15న గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమై అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నదానం 16న స్వామివారి కల్యాణం, 17న కోలాటలతో స్వామివారికి ఊరేగింపు, 18న ఖమ్మం వారిచే డాన్స్‌ బేబీ డాన్స్‌ పోటీలు, 19న రథోత్సవం, 20న వసంత ఉత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు ఐదు రోజుల పాటు అన్నదానం చేసేందుకు కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


వంద ఎకరాలకు మిగిలింది 47ఎకరాలు 

కాకతీయుల తర్వాత మునగాల పరగణాను పాలించిన నడిగూడెం జమిందారు రాజానాయిని వెంకటరంగారావు చెన్నకేశవ స్వామి ఆలయ దూప దీపా నైవేథ్యాలకు వంద ఎకరాల భూమిని ఇనాంగా ఇచ్చారు. కరువు కాటకాలతో పంటలు పండక నిత్యా నైవేథ్యాలకు, ఉత్సవాలకు కొంతభూమి అమ్మాల్సిరాగ చాకలి, కుమ్మరికి కొంత భూమి కేటాయించారు. మరికొంత భూమి ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం కరవిరాల రెవెన్యూలో 27ఎకరాలు, చెన్నకేశవపురం పరిధిలో 20ఎకరాల భూమి ఉండగా వచ్చే కౌలుతోనే పూజారికి జీతాలు, ఉత్సవ ఖర్చులు చెల్లిస్తున్నారు. అంతంతమాత్రంగా జరుపుతూ వస్తున్న బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్థులంతా ఐక్యంగా ముందుకొచ్చి కమిటీని ఎన్నుకున్నారు. ఆలయ గోపురంపై పంచ లోహాలతో సుమారు నాలుగు అడుగుల ఏర్పాటు చేసిన సుదర్శన చక్రం రాష్ట్రంలోనే ప్రాధాన్యం కలిగింది. 


ఏర్పాట్లు పూర్తి చేశాం..

ఈ ఏడాది చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రామస్థులు, దాతల విరాళాలతో సుమారు రూ.5లక్షలు ఉత్సవాలకు ఖర్చు చేస్తున్నాం. ఆలయానికి రంగులు, లైటింగ్‌ చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశాం. 

 మారోజు వెంకటచారి, ఆలయ కమిటీ చైర్మన్‌.

Updated Date - 2022-05-15T06:42:06+05:30 IST