దర్శనభాగ్యం

ABN , First Publish Date - 2020-06-07T07:33:22+05:30 IST

లాక్‌డౌన్‌ 5.0 అమలులో భాగంగా ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి దేవాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, మాల్స్‌ తెరుచుకోబోటజీన్నాయి.

దర్శనభాగ్యం

రేపటి నుంచి దేవాలయాలు పునఃప్రారంభం

హోటల్స్‌, రెస్టారెంట్‌లు, మాల్స్‌కూ అనుమతి

కొన్ని షరతులు వర్తిస్తాయి...

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోతే మూసివేత

మీడియా సమావేశంలో వివరించిన కలెక్టర్‌


గుంటూరు, కార్పొరేషన్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ 5.0 అమలులో భాగంగా ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి దేవాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, మాల్స్‌ తెరుచుకోబోటజీన్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీచేసింది. ఆ వివరాలను  కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, అర్బన్‌ డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ పి.ప్రశాంతి శనివారం కలెక్టరేట్‌లో మీడియా సమావేశంలో వివరించారు. ప్రతీ దేవాలయం, మసీదు, చర్చీలకు ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఉండాలి. ప్రవేశద్వారం వద్దనే థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయడం మాస్కులు తప్పనిసరి. భక్తులను స్లాట్‌ వారీగా అనుమతించాలి. విగ్రహాలను, మతపరమైన గ్రంథాలను తాకరాదు.


భక్తులకు తీర్థప్రసాదాల పెట్టడం, శఠగోపం, నీళ్లు చల్లడం వంటివి చేయరాదు. హోటళ్లలో సాధ్యమైనంత వరకు ఆహార పదార్థాలను పార్శిల్‌గా తీసుకెళ్లేలా ప్రోత్సహించాలి. నగదు వాడకం తగ్గించి కాంటాక్ట్‌ లెస్‌ పేమెంట్స్‌ని ప్రోత్సహించాలి. రెస్టారెంట్లలో ఒక టేబుల్‌ మీద ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే కనీసం ఆరు అడుగుల దూరంలో కుర్చీలు ఏర్పాటు చేయాలి. సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలి. సిబ్బంది మొత్తం ఫేస్‌మాస్కులు, గ్లవ్స్‌ ధరించాలి.

 

 జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం, మంగళగిరి లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం, అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానం, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం, మాచర్ల చెన్నకేశవస్వామి ఆలయం, బాపట్ల భావనారాయణ స్వామి దేవస్థానం, పొన్నూరు ఆంజనేయస్వామి దేవస్థానం తదితర ఆలయాలను సుమారు 69 రోజుల తరువాత తెరుస్తున్నారు. 8, 9 తేదీల్లో రెండు రోజులు మాత్రమే ట్రైయిల్‌ రన్‌ కింద ఆలయ సిబ్బంది, ఆలయ పరిసర ప్రాంతాలో ఉన్న ప్రజలకు మాత్రమే దర్శనం భాగ్యం కల్పిస్తారు. 10వ తారీఖు నుంచి ఇతర భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు.  కరోనా వ్యాప్తి చెందకుండా పరిమితంగా భక్తులను అనుమతించే విధంగా ఇప్పటికే అధికారులు ఆయా ప్రాంతాలో మార్కింగ్‌లను, ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసిన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-06-07T07:33:22+05:30 IST