రేపటి నుంచే దర్శనభాగ్యం

ABN , First Publish Date - 2020-06-07T06:26:23+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆలయాలు భక్తుల దర్శనం కోసం ముస్తాబయ్యాయి. సోమవారం నుంచి ప్రార్థన మందిరాలు మందిరాలు తెరుచుకోవచ్చని

రేపటి నుంచే దర్శనభాగ్యం

  • రేపటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు
  • 8, 9 తేదీల్లో ట్రయల్‌ రన్‌
  • ఆ తర్వాత స్థానికేతరులకు..
  • సర్వం సిద్ధం చేసిన దేవదాయ శాఖ అధికారులు 
  • కరోనా నిబంధనలు పాటించ్సాసందే!

నెల్లూరు (సాంస్కృతికం)/రాపూరు, జూన్‌ 6 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆలయాలు భక్తుల దర్శనం కోసం ముస్తాబయ్యాయి.  సోమవారం నుంచి ప్రార్థన మందిరాలు మందిరాలు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 5వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం పలు  సూచనలతో సర్క్యులర్‌ విడుదల చేసింది. దేవాలయాలు ఇతర మతాల ప్రార్థన ఆలయాలు, హోటళ్లు, షాపింగ్‌మాళ్లు తెరుచుకునేందుకు పాటించాల్సిన నియమాలను అందులో పొంది పరిచింది. రెడ్‌జోన్‌ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల ఆలయాల వద్ద అవసరమైన అన్ని చర్యలను ఈవోలు, సహాయ కమిషనర్లు తీసుకుంటున్నారు. సోమవారం ఆలయాలలో అర్చకులు, అధికారులు, సిబ్బందితో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. 9వ తేదీ ఆలయాల పరిసరాలలో స్థానికులకు దర్శనం కల్పిస్తారు.


ఈ రెండు రోజుల్లోని లోపాలను సరిదిద్ది 10వ తేదీ నుంచి భక్తులందరినీ ఆలయాల్లోకి అనుమతిస్తారు. అంతరాలయంలో భక్తులకు ప్రవేశం ఉండదు. తీర్థం, శఠారి, ప్రసాదం ఉండవు. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ కేవలం దర్శనం మాత్రం కల్పిస్తారు. ఆర్చిత సేవలుపై దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు ఆలయాల్లో భౌతిక దూరం 6 అడుగులు ఉండేలా గుర్తుల క్యూలైన్లు, శానిటైజర్లు, సిబ్బందికి మాస్క్‌లు వంటి కోవిడ్‌ రక్షణ పరికరాలను సిద్ధం చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. 


పెంచలకోనలో..

పెంచల నృసింహుడి దర్శన భాగ్యం సోమవారం నుంచి కలగనుంది. సుమారు 80 రోజుల తర్వాత భక్తులకు ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. 8, 9 తేదీల్లో దేవస్థానం సిబ్బంది, స్థానికులకు ట్రయల్‌ రన్‌ కింద దర్శనం కల్పిస్తామన్నారు. 11 నుంచి భక్తులందరినీ అనుమతిస్తామన్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 12.30  గంటల వరకు, ఆ తర్వాత 3 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పెంచలస్వామిని భక్తులు దర్శనం చేసుకోవచ్చు. కాగా, క్షేత్రంలోని ఆలయాలతోపాటు భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లో శనివారం శానిటేషన్‌ చేశారు. పెంచలకోన క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత పెంచల నృసింహుడి కల్యాణాన్ని ఆలయ అర్చకులు శనివారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూలవిరాట్‌కు అభిషేకాలు, చందనాలంకారసేవ నిర్వహించారు.


కామాక్షితాయి సన్నిధిలో..

బుచ్చిరెడ్డిపాళెం, జూన్‌ 6 : జొన్నవాడ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్‌ చీమల రమేష్‌బాబు, ఈవో ఏవీ.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ వేగూరు రవీంద్రారెడ్డి శనివారం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించడంతోపాటు ఆలయ పరిసరాలు, నదీస్నానాలు నిషేధించినట్లు తెలిపారు. ఆలయంలో నిద్ర చేసే పద్ధతిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. 


నిబంధనలు

  1. దర్శనానికి వచ్చే భక్తులు విధిగా భౌతిక దూరం (6 అడుగులు), వ్యక్తిగత శుభ్రత పాటించి, ముఖానికి మాస్కు ధరించాలి. ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రం దర్శనానికి అవకాశం ఇస్తారు.
  2. పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, గర్భిణులకు, జలుబు, జ్వరం ఉన్న వారికి ప్రవేశం ఉండదు.
  3. భక్తులు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. థర్మల్‌ గన్‌ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరిశీలించిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.
  4. సిబ్బంది గీసిన సర్కిల్‌లో నిలబడి ఆధార్‌కార్డు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపాలి. 
  5. ఆలయంలో తీర్థ ప్రసాదాలు ఇవ్వరు. నిర్ధేశించిన ప్రాంతంలోనే  టెంకాయలు కొట్టాలి. దేవుళ్లకు ఇచ్చే కానుకలను నిర్ధేశించి కౌంటర్‌లోనే ఇవ్వాలి. 
  6. దేవస్థాన పరిసర ప్రాంతాలలో నదీ స్నానం పూర్తిగా నిషిద్ధం. రాత్రిపూట నిద్ర చేయకూడదు. 
  7. వసతి గదులలో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తారు.

Updated Date - 2020-06-07T06:26:23+05:30 IST