ఆలయాల్లో చోరీకి పాల్పడే నిందితుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-10-04T04:41:02+05:30 IST

ఆలయాల్లో చోరీకి పాల్పడే ఇద్దరు నిందితులను వెంకటాచలం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆలయాల్లో చోరీకి పాల్పడే నిందితుల అరెస్ట్‌
మాట్లాడుతున్న రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి

వెంకటాచలం, అక్టోబరు 3 : ఆలయాల్లో చోరీకి పాల్పడే ఇద్దరు నిందితులను వెంకటాచలం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం   పోలీస్‌స్టేషన్‌లో నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాపూరు మండలం గోనునరసాయపాళెంలో మాతమ్మ ఆలయంలో అమ్మవారి బంగారు మంగళసూత్రం, సంక్రాంతిపల్లిలోని రామాలయంలో హుండీని ఈ ఏడాది గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేయడంతో కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే గతనెల 4వ తేదీన మండలంలోని అనికేపల్లిలో అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో  హుండీని, గత నెల 26న వెంకటాచలంలోని అయ్యప్పస్వామి గుడిలో హుండీని చోరీ చేయడంతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా  నిందితులిద్దరు చెడు వ్యసనాలకు బానిసలై, ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. వెంకటాచలం సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ అయ్యప్ప, సిబ్బంది నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారన్నారు. అందులో భాగంగా విచారణ చేపట్టగా.. నెల్లూరులోని కోటమిట్టకు   చెందిన షేక్‌ షహీద్‌, కొత్తూరులోని టైలర్స్‌ కాలనీకి చెందిన షేక్‌ షాబీద్‌ ఈ చోరీలకు పాల్పడ్డారన్నారు. ఈ నాలుగు కేసుల్లో రూ.19వేలు నగదు, మూడు గ్రాముల బంగారం చోరీకి కాగా.. వారి నుంచి రూ.7వేలు నగదు, మూడు గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. కేసును చేధించిన సీఐ, ఎస్‌ఐతోపాటు సిబ్బందిని ఎస్పీ విజయరావు అభినందించినట్లు తెలిపారు. 


వాశిలిలో పంచలోహ విగ్రహాలు చోరీ

ఆత్మకూరు, అక్టోబరు 3 : మండలంలోని వాశిలి గ్రామంలో సీతారాముల దేవాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోని సీతారామలక్ష్మణ, ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-10-04T04:41:02+05:30 IST